వృద్ధ తల్లిదండ్రులను విస్మరించొద్దు!
ఎస్సీ, ఎస్టీలకే పథకాలు అందాలి
ఇంకొల్లు(చినగంజాం): వృద్ధ తల్లిదండ్రులను విస్మరించరాదని, వారిని ఆదుకోవడం బాధ్యతని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఇంకొల్లు పంచాయతీ కార్యాలయం ఆవరణలో బుధవారం ఆయన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలసి రూ. 4 లక్షలతో దాతలు నిర్మించిన నూతన వేదికను ఆయన ప్రారంభించారు. వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. పాఠశాలలో మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బాపట్ల జిల్లా 20 మండలాలకు చేరడం, అద్దంకి నియోజక వర్గంలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయడం శుభపరిణామని తెలిపారు. రైతుల వద్ద మిగిలి పోయిన బ్లాక్ బర్లీ పొగాకును కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నామని చెప్పారు. మొక్కజొన్నకు గిట్టుబాటు ధర ఉందని, పొగాకుతో నష్టపోయిన రైతులు ప్రత్యామ్నాయ పంటగా దాన్ని సాగు చేసుకోవాలని సూచించారు. మార్టూరు మండలంలో ఎంఎస్‌ఎంఈ పార్కు, ఇంకొల్లు మండలంలో ఆటోనగర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రతి నెలా నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు మాట్లాడుతూ శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి, ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. పర్చూరు– ఇంకొల్లు రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్‌కుమార్, చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్, డెప్యూటీ కలెక్టర్ ఎస్. లవన్న, మండల ప్రత్యేకాధికారి రమేష్ బాబు, ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు పాల్గొన్నారు.
ప్రాజెక్టుల పనులు సకాలంలో
పూర్తి చేయాలి
జిల్లాలో ప్రాజెక్టు పనుల్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ వి. వినోద్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి బుధవారం నేషనల్ హైవే, ఆర్ అండ్ బీ, రైల్వే, పర్యాటక, ఫిషరీస్, విద్య, వైద్య శాఖల అధికారులతో మాట్లాడారు. వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి– 167 ఏను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. గుంటూరు– నిజాంపట్నం, నిడుబ్రోలు–చందోలు ఆర్ అండ్ బీ రహదారి విస్తీర్ణం పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. కర్లపాలెం–గణపవరం రహదారి పనుల్లో ప్రతి వారం పురోగతి ఉండాలని, నిండుబ్రోలు– చందోలు, రేపల్లె– నిజాంపట్నం రోడ్లను మార్చి 31వ తేదీలోగా పూర్తి చేయాలని చెప్పారు.
షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించిన నిధులు నూరు శాతం వారికే ఖర్చు చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాలులో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల కాంపోనెంట్ మానిటరింగ్ కమిటీ జిల్లా స్థాయి సమావేశాన్ని ఆయన నిర్వహించారు. సంబంధిత శాఖల అధికారులతో ఆయన మాట్లాడారు.


