డివిజన్ స్థాయిలోనూ రెవెన్యూ క్లినిక్‌లు
కలెక్టర్ రాజాబాబు
అద్దంకి: జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌లను త్వరలో డివిజన్ స్థాయిలోనూ ప్రవేశపెట్టనున్నట్లు కలెక్టర్ పి.రాజాబాబు వెల్లడించారు. పట్టణంలోని ఆర్ అండ్ బీ బంగ్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ కార్యాలయాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాలు, ఐదు కొత్త డివిజన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. అందులో భాగంగా బాపట్లలో ఉన్న అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపారని చెప్పారు. నూతన రెవెన్యూ డివిజన్లలో భాగంగా అద్దంకి రెవెన్యూ డివిజన్‌గా చేశారని వివరించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీల్లో 70 శాతం రెవెన్యూ సమస్యలే వస్తున్నాయని తెలిపారు. ఈ కారణంగా రెవెన్యూ క్లినిక్‌లను ఏర్పాటు చేశామని చెప్పారు. నెల తరువాత ఆర్డీఓ స్థాయిలో క్లినిక్‌ను ఏర్పాటు చేసి రెవెన్యూ సమస్యలకు సత్వర పరిష్కారం అందిచే దిశగా కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, తహసీల్దార్లు పాల్గొన్నారు.
గుంటూరు మెడికల్: జిల్లాలో పనిచేస్తున్న 108 అంబులెన్సు సిబ్బంది జనవరి 12వ తేదీ నుంచి సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ మేరకు నోటీసును గుంటూరు జిల్లా వైద్య అధికారులకు అందజేశారు. జనవరి 5న జిల్లా కలెక్టరేట్‌ల వద్ద నిరసన, 7న ముఖ్యమంత్రికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి మెయిల్స్ పంపడం, 10న విజయవాడలో ఒక్కరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.


