కోర్టు భవన స్థలాన్ని పరిశీలించిన పల్నాడు కలెక్టర్
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా బుధవారం కోర్టు భవన నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని స్థానిక అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె సంబంధిత అధికారులతో స్థల వివరాలు, భవిష్యత్ అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బొప్పూడి సమీపంలోని జాతీయ రహదారికి సంబంధించి ట్రంపెట్ జంక్షన్‌ను పరిశీలించారు. హైవే సర్వీసు రోడ్డులో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించారు. పురుషోత్తమపట్నం గ్రామస్తుల వినతి మేరకు గ్రామం నుంచి కోటప్పకొండ ప్రభలు వెళ్లేందుకు అనువుగా సర్వీసు రోడ్డు విస్తీర్ణం పెంచాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధులత, తహసీల్దార్ షేక్ మొహమ్మద్ హుస్సేన్, మున్సిపల్ కమిషనర్ పి. శ్రీహరిబాబు పాల్గొన్నారు.
అమరావతి: అమరావతిలోని శ్రీబాలచాముండికా సమేత అమరేశ్వరునికి శనివారం వేకువ జామున మహన్యాస పూర్వక ఏకాదశరుద్ర అన్నాభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో రేఖ తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ ధనుర్మాసంలో స్వామివారి జన్మనక్షత్రం ఆరుద్ర సందర్భంగా దాతల సహకారంతో సుమారు రెండు క్వింటాళ్ళకు పైగా బియ్యాన్ని అన్నంగా వండి స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారన్నారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని, పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ప్రత్తిపాడు: గుంటూరు జిల్లా పెదనందిపాడు బ్రాంచి కెనాల్ ద్వారా ప్రతి ఎకరాకు సాగు నీరు అందిచేందుకు కృషి చేస్తున్నామని ఇరిగేషన్ డీఈ మల్లికార్జున్ అన్నారు. పెదనందిపాడు బ్రాంచి కెనాల్‌పై బుధవారం డీసీ ప్రెసిడెంట్ కల్లూరి కుసుమతో కలిసి ఇరిగేషన్ అధికారులు పర్యటించారు. నాగార్జున సాగర్ కాలువ ద్వారా వస్తున్న సాగు నీటిని మల్లాయపాలెం మేజర్ 15వ నంబరు వద్ద పరిశీలించారు. ఈ సందర్భంగా చిలకలూరిపేట సబ్ డివిజన్ ఇరిగేషన్ డీఈ మలికార్జున్ మాట్లాడుతూ పీబీసీ కింద సుమారు యాభై నుంచి అరవై వేల ఎకరాలు సాగులో ఉన్నాయన్నారు. పదేళ్లకిందట ప్రపంచ బ్యాంకు నిధులతో అభివృద్ధి పనులు జరిగాయని, తరువాత నిర్వహణ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని తెలిపారు. కానీ ఇటీవల పనులు చేయించామని చెప్పారు. నాగార్జున సాగర్ డ్యామ్‌లో ఉన్న నీటి లభ్యతను అనుసరించి విడుదల చేసిన నీటిని రైతులు నియంత్రించుకుంటూ వినియోగించుకోవాలని డీఈ కోరారు. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కల్లూరి శ్రీనివాసరావు తదితరులున్నారు.
సత్తెనపల్లి: అయోధ్యలో బాలరామ ప్రాణప్రతిష్ట రెండో వార్షికోత్సవ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్, నారాయణ సేన నగర సంకీర్తన సభ్యులు, హిందూ బంధువులు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ప్రధాన రహదారిలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం నుంచి కట్టమూరివారి వీధిలోని రామాలయం వరకు బుధవారం రాత్రి పూలమాలను రామ నామంతో శోభాయాత్రగా తీసుకువెళ్లి స్వామికి సమర్పించారు. నారాయణ సేన నగర సంకీర్తన కార్యనిర్వాహక సభ్యుడు అన్నం రమణ మాట్లాడుతూ 500 సంవత్సరాల సుదీర్ఘ సంఘర్షణ తర్వాత అందరి కృషి, ఆర్థిక సహకారంతో అయోధ్యలో శ్రీరామ జన్మభూమిలో మందిర నిర్మాణం చేసుకొని బాలరాముని ప్రతిష్ట జరుపుకొని రెండు సంవత్సరాల పూర్తయిందన్నారు. అనంతరం గాంధీచౌక్‌లో ఉన్న వినాయక దేవాలయంలో శ్రీరామ చిత్రపటం ఉంచి పూజలు, భజనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరిపారు.
కోర్టు భవన స్థలాన్ని పరిశీలించిన పల్నాడు కలెక్టర్
కోర్టు భవన స్థలాన్ని పరిశీలించిన పల్నాడు కలెక్టర్


