పాలు త్వరగా ఇచ్చేలా పశువులకు నిషేధిత ఇంజెక్షన్
వినియోగిస్తే ఆరోగ్యానికి పలు విధాలుగా అనర్థం
అక్రమార్జన కోసం ప్రజారోగ్యంతోనూ చెలగాటం
కనీస చర్యలు తీసుకోవడంలో సర్కారు విఫలం
చీరాల టౌన్: చాలామంది యజమానులు ఎక్కువ పాలు సేకరించేందుకు పాడి గేదెలకు చెందిన దూడలకు సరిపడా పాలు తాగకుండా తల్లి నుంచి దూరం చేస్తున్నారు. అవి పాలు సరిపడక అనారోగ్యానికి గురై చనిపోతున్నాయి. గేదెకు పొదుగు నుంచి రొమ్ముల వరకు పాలు రావాలంటే దూడ కొద్దిసేపు పొదుగు వద్ద సేపేందుకు ప్రయత్నం చేయాల్సి ఉంది. దూడ లేకుంటే మిగులు పాలన్నీ అమ్మవచ్చనే దూరాలోచనతో దూడ బదులు నిషేధిత డ్రగ్ ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను రోజుకు రెండుసార్లు గేదెలకు వేసి మొత్తం పాలు పిండుతున్నారు.
ఈ ఇంజెక్షన్ హర్మోన్లను ప్రభావితం చేస్తుంది. గేదె సేపాలంటే దూడ కనీసం పది నిమిషాలపాటు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కానీ అదే రెండు రూపాయలు విలువైన ఆక్సోటోసిన్ ఒక్క ఇంజెక్షన్ వేస్తే చాలు క్షణాల్లో గేదె సేపి పొదుగు నుంచి పాలు కారిపోతాయి. గేదెలకు ఉదయం 2 ఎంఎల్, సాయంత్రం 2 ఎంఎల్ చొప్పున ఒక్కో గేదెకు వేస్తున్నారు. అంత ప్రమాదకర ఈ ఇంజెక్షన్‌ను నోరులేని జీవాలు తట్టుకోవడం చాలా కష్టం.
బాపట్ల జిల్లాలోని చీరాల, బాపట్ల, పర్చూరు, రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో 2024లో నిర్వహించిన 21వ పశుగణన ప్రకారం ఆవులు 21,930, గేదెలు 3,81,764, గొర్రెలు 2,49,394, మేకలు 30,691 ఉన్నాయి. వీటిలో పశువుల నుంచి పాలు తాగే దూడలు చాలా తక్కువే అని చెప్పవచ్చు. ప్రమాదకర హర్మోన్లు ఉన్న ఇంజెక్షన్లను పాడి గేదెలకు వేయడం వలన గేదెలు ఎదకు రాకపోవడం, గర్భసంచి వంటి భాగాలకు జబ్బులు సోకడంతోపాటు తక్కువ కాలానికే ఆ గేదెలు చనిపోతున్నాయి.
నిషేధించిన ప్రభుత్వం
ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల వాడకంతో ఆ పాలు తాగిన వారితోపాటు పశువులు అంతరించిపోతున్నాయనే ఉద్దేశంతో చాలా కాలంగా ఈ ఇంజెక్షన్లను ప్రభుత్వం నిషేధించింది. కానీ చాటుమాటున చెన్నై వంటి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. చీరాల పట్టణంలోని పశువు మందులు అమ్మే దుకాణాల్లో చాలా వాటిల్లో వీటి అమ్మకాలు చేస్తున్నారు. రూరల్ గ్రామాల్లోని పశుపోషకులకు యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. అయినా డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మూమూళ్ల మత్తులో పడి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ పరంగా కూడా కనీస చర్యలు కొరవడ్డాయి.
ఆ పాలు తాగితే అనర్థాలు
ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ వాడిన గేదెల పాలు తాగితే అనేక అనర్థాలు వస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రమాదకర హర్మోన్లు కలిసిన పాలు తాగితే క్యాన్సర్ వంటి జబ్బులు వస్తాయని చెబుతున్నారు. కళ్ల జబ్బులతోపాటు ఆడ పిల్లలు చిన్న వయసులోనే మెచ్యూర్ కావడం, రొమ్ములు పెరగడంతోపాటు అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు.
తనిఖీలు శూన్యం
చీరాలతోపాటుగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో సేపు ఇంజెక్షన్లు విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నా కానీ డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు కనీసం మూడు నెలలకు ఒకసారి కూడా తనిఖీలు చేయడం లేదు. చీరాల్లో ప్రాంతీయ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ (ఔషధ నియంత్రణ అధికారి) కార్యాలయం ఉన్నా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు రవాణా అవుతున్నా కూడా కట్టడి చేయలేని స్థితిలో ఉన్నారు.


