
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం మండలం మార్వాడలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడు ఇంటి ఎదుట ఓ యువతి మంటల్లో కాలింది. బాధితురాలిది ప్రొద్దుటూరుకు చెందిన ప్రశాంతిగా పోలీసులు గుర్తించారు.
ఆర్టీసీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ప్రశాంతి మార్వాడకు చెందిన వాసుతో ప్రేమ వ్యవహారం నడుపుతోంది. అయితే, ప్రశాంతితో ప్రేమకు ముందే వాసుకు వివాహం జరిగింది. ఈ క్రమంలో గురువారం ప్రశాంతి.. మార్వాడలో ఉన్న వాసును కలిసేందుకు అతని ఇంటికి వచ్చింది.
ఈ క్రమంలో ప్రశాంతి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను పోసుకొని నిప్పటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో అప్రమత్తమైన గ్రామస్తులు యువతికి అంటుకుంటున్న మంటల్ని ఆర్పేశారు. అనంతరం, అత్యవసర చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అత్యవసర చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా,బాధితురాలు ప్రొద్దుటూరులో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నట్లు సమాచారం.
వాసు ఇంటి ఎదుట మంటల్లో కాలిన యువతి ,ప్రశాంతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రశాంతిది ఆత్మహత్యా? లేక నిప్పు పెట్టారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.