బాలికలు, మహిళలను వేధించే వారిని  వదలం | AP Women Commission Chairperson Gajjala Venkatalakshmi warned | Sakshi
Sakshi News home page

బాలికలు, మహిళలను వేధించే వారిని  వదలం

Apr 4 2024 5:19 AM | Updated on Apr 4 2024 5:19 AM

AP Women Commission Chairperson Gajjala Venkatalakshmi warned - Sakshi

ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మి హెచ్చరిక 

రూపశ్రీ మృతిపై విశాఖ కళాశాలలో విస్తృత విచారణ

న్యాయం చేస్తామని విద్యార్థిని తల్లిదండ్రులకు భరోసా  

మధురవాడ(భీమిలి): బాలికలు, మహిళలను ఇబ్బందులకు గురిచేసినా, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినా అలాంటి వారిని వదిలే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మి హెచ్చరించారు. విశాఖ కొమ్మాది చైతన్య కళాశాలలో ఫ్యాకల్టీ లైంగిక వేధింపులకు విద్యార్థిని రూపశ్రీ మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో విచారణ కమిటీ సభ్యులు, ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావుతో కలిసి బుధవారం ఆమె కళాశాలను సందర్శించారు.

తరగతి గదులు, ల్యాబ్‌లు, హాస్టల్‌ భవనం, పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. తర్వాత అక్కడి ఇంజనీరింగ్, డిప్లమా ఫ్యాకల్టీ, సిబ్బందితో వేర్వేరుగా సమావేశమయ్యారు. మీ పిల్లలు ఈ పరిస్థితిలో ఉంటే ఇలానే వదిలేస్తారా? ఇక్కడ ల్యాబ్‌లో ఓ వ్యక్తి ఆడబిడ్డల పట్ల అంత దారుణంగా వ్యవహరిస్తున్నాడంటే వాడు మనిషా, పశువా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కళాశాల గుర్తింపు రద్దుకు సిఫార్సు
అనంతరం వెంకటలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ పిల్లలను తీర్చిదిద్దాల్సిన ఫ్యాకల్టీయే విద్యార్థులతో సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించడం దారుణమన్నారు. విద్యా సంస్థకు ఉండాల్సిన కనీస నిబంధనలను ఈ కళాశాల పాటించడం లేదని తెలిపారు. చాలా చోట్ల సీసీ కెమెరాల్లేవని, ల్యాబ్‌లో మానిటరింగ్‌ సిస్టమ్‌ లేదన్నారు. ఉమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్, రికార్డులు, ఐసీసీ కమిటీలు, యాంటీ ర్యాగింగ్‌ సిస్టం.. కనీసం కంప్లయింట్‌ బాక్స్‌ కూడా లేదన్నారు. కళాశాల గుర్తింపు రద్దుకు సిఫార్సు చేస్తున్నామన్నారు.

హాస్టల్‌లో విద్యార్థులకు కల్పించే వసతులు, భోజనం వంటి విషయాల్లోనూ వివక్ష ఉందని, ప్రభుత్వం నుంచి ఫీజు వచ్చేవారికి నాణ్యమైన భోజనం లేదని, కనీసం మంచాలు కూడా లేవన్నారు. ప్రైవేటు ఫీజులు చెల్లించే వారికి అన్ని సౌకర్యాలూ కల్పించారని చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు అరెస్ట్‌ అయ్యారని, ఇంకా విచారణ కొనసాగుతోందన్నారు. కాగా, రూపశ్రీ మృతిపై వెంకటలక్ష్మి పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

నాలుగో అంతస్తుపై నుంచి పడి మృతి చెందిన బాలిక శరీరంపై ఏ రకమైన దెబ్బలూ లేకపోవడం, ఒక బాలిక ఉదయం నుంచి రాత్రి వరకు కనిపించకున్నా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం వంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయన్నారు. అనంతరం ఆందోళన శిబిరంలో ఉన్న రూపశ్రీ తల్లిదండ్రులను పరామర్శించి.. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కమిషన్‌ సభ్యురాలు గెడ్డం ఉమ, ఏపీఎస్‌సీపీసీ డైరెక్టర్‌ టి.ఆదిలక్ష్మి, మహిళా కమిషన్‌ డైరెక్టర్‌ ఆర్‌.సుజి, ఏయూ లా కాలేజి ప్రొఫెసర్‌ విజయలక్ష్మి, మహిళా కమిషన్‌ లీగల్‌ కౌన్సిలర్‌ పూజితయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.  

పూర్తి నివేదిక ఇవ్వండిసీఎస్, డీజీపీలకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఫ్యాకల్టీయే లైంగికంగా వేధిస్తే ఇంకెవరికి చెప్పను నాన్న.. అంటూ తండ్రికి మెసేజ్‌ చేసి ఆత్మహత్యకు పాల్పడిన బాలిక ఘటనపై నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) స్పందించింది. బాలిక ఆత్మహత్య ఘటనపై పూర్తి నివేదికను అందించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు నోటీసులిచి్చంది.  మార్చి 28న విశాఖపట్నం కొమ్మాది­లోని ‘చైతన్య ఇంజనీరింగ్‌’ కళాశాలలో డి­పొ్ల­­మా మొదటి సంవత్సరం చదువుతున్న రూపశ్రీ(16) లైంగిక వేధింపుల కారణంగా హాస్టల్‌ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

తన ఫ్యాకల్టీయే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు, ఫొటోలు తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ బెదిరిస్తున్నాడని తండ్రికి మెసేజ్‌లో తెలిపింది. ఈ ఘటనపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ సుమోటాగా కేసు నమోదు చేసింది. నాలుగు వారాల్లో బాలిక ఆత్మహత్యకు గల కారణాలతో తమకు నివేదిక అందించాలంటూ సీఎస్, డీజీపీలను ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. నివేదికతో పాటు రాష్ట్ర పోలీసు శాఖ జరిపిన ఇన్వెస్టిగేషన్‌ను కూడా తెలపాలంటూ సూచించింది.

కాగా, బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనను పరిశీలిస్తే కొమ్మాదిలోని “చైతన్య ఇంజనీరింగ్‌’ కళాశాల యాజమాన్యమే కారణం అనే విషయం తెలుస్తోందంటూ ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది. కాలేజీలో ఇంకెంతమంది విద్యార్థినిలు ఫ్యాకల్టీల లైంగిక వేధింపులకు గురవుతున్నారనే విషయాన్ని రాష్ట్ర పోలీసు శాఖ క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని సూచనలు చేసింది. విద్యార్థినులను వేధిస్తున్న వారిపై కేసులను సైతం నమోదు చేయాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement