వాణిజ్య ఎగుమతుల్లో ఏపీ జోష్‌! | AP Josh in commercial exports | Sakshi
Sakshi News home page

వాణిజ్య ఎగుమతుల్లో ఏపీ జోష్‌!

Jun 1 2024 5:55 AM | Updated on Jun 1 2024 5:55 AM

AP Josh in commercial exports

ఐదేళ్లలో 65 శాతం వృద్ధితో రూ.64,578 కోట్లకు పెరుగుదల

ఏటా 13.04 శాతం సగటు వృద్ధితో రికార్డు

2023–24లో రూ.1.63 లక్షల కోట్లకు చేరిన ఎగుమతులు

దేశవ్యాప్తంగా ఎగుమతులు క్షీణించినా రాష్ట్రంలో 2.63 శాతం వృద్ధి

దేశంలో 6వ స్థానంతో ఏపీ దూకుడు

సాక్షి, అమరావతి: వాణిజ్య ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ మరోసారి దూకుడు ప్రదర్శించింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి దేశవ్యాప్తంగా తగ్గినా రాష్ట్రంలో 2.63 శాతం వృద్ధి నమోదు కావడం ఇందుకు నిదర్శనం. 2022–23లో రూ.1,59,368.02 కోట్లుగా ఉన్న రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల విలువ 2023–24కి రూ.1,63,562.68 కోట్లకు చేరినట్లు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో పేర్కొంది. 

ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాల ఎగుమతులు క్షీణించినా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఎగుమతుల్లో వృద్ధి నమోదైందని అధికారులు వెల్లడించారు. సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర ఆధారిత ఆర్థిక అవకాశాలను అందిపుచ్చుకోవడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన చర్యలు సత్ఫలితాలను అందిస్తున్నాయి. 

ఆయన అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఎగుమతుల విలువ రూ.98,983.95 కోట్లుగా ఉంది. వాణిజ్య ఎగుమతులు గత ఐదేళ్లలో 65.24 శాతం వృద్ధి చెంది రూ.1,63,562.68 కోట్లకు చేరాయి. అంటే.. ఏటా సగటున 13.04 శాతం వృద్ధి నమోదు చేయడం ద్వారా ఐదేళ్లలో ఎగుమతులు రూ.64,578.73 కోట్లకు పెరిగాయి. 2018–19 నాటికి దేశవ్యాప్త ఎగుమతుల్లో రాష్ట్రం 9వ స్థానంలో ఉంది. ఇప్పుడు 4.52 శాతం వాటాతో 6వ స్థానంలోకి ఎగబాకడం విశేషం.

10 శాతం వాటా లక్ష్యంగా అడుగులు..
2030 నాటికి 10 శాతం మార్కెట్‌ వాటాతో టాప్‌–3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. దీనికనుగుణంగా పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్‌ ఎక్స్‌పోర్ట్‌ హబ్‌ను ఏర్పాటు చేసింది. ఆయా దేశాలకు చేస్తున్న ఎగుమతుల్లో ఇతర ఉత్పత్తుల ఎగుమతికి ఉన్న అవకాశాలను గుర్తిస్తోంది. వాటిని అందిపుచ్చుకునే విధంగా చర్యలు తీసుకుంది. 

అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25,000 కోట్లతో నాలుగు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లను అభివృద్ధి చేస్తోంది. ఇందులో రామాయపట్నం పోర్టు ఈ ఏడాది, మిగిలిన మూడు పోర్టులు 2025 నాటికి అందుబాటులోకి రానున్నాయి. కొత్తగా నిర్మించే నాలుగు పోర్టుల ద్వారా అదనంగా లక్ష మందికి ఉపాధి లభించనుంది. దీంతో రాష్ట్ర జీడీపీ, ప్రజల తలసరి ఆదాయంలో గణనీయ వృద్ధి నమోదవుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. 

మరోవైపు ఎగుమతుల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతిఆయోగ్‌ కూడా ప్రశంసించింది. 2022కి నీతిఆయోగ్‌ ప్రకటించిన ఎగుమతి సన్నద్ధత రాష్ట్రాల్లో రాష్ట్రం 59.27 పాయింట్లతో 8వ స్థానంలో నిలవడం విశేషం. రెండేళ్ల క్రితం ఎగుమతి సన్నద్ధత రాష్ట్రాల్లో 20వ స్థానంలో ఉన్న రాష్ట్రం 12 స్థానాలు మెరుగుపరుచుకొని 8వ ర్యాంకుకు చేరుకోవడం విశేషం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement