
సాక్షి, గుంటూరు: హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్‌ను జైలు అధికారులు విడుదల చేయలేదు. హైకోర్టు తక్షణమే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చినా జైలు అధికారులు కిషోర్‌ను విడుదల చేయకపోవడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తురకా కిషోర్ తరపున న్యాయవాది.. హైకోర్టు ఉత్తర్వులను గురువారం రాత్రి 12 గంటల సమయంలో జైలుకు అందించినప్పటికీ విడుదల చేయడం లేదు. కాగా, తమ పేరుతో రిలీజ్‌కు డైరెక్షన్ ఇవ్వలేదు కాబట్టి తాము విడుదల చేయలేమని జైలు అధికారులు వింతగా జవాబు ఇవ్వడం గమనార్హం.
అంతకుముందు.. తురకా కిషోర్‌పై ఎప్పుడో ఏడాదిన్నర క్రితం ఘటన జరిగితే ఇప్పుడు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన వ్యవహారంలో అటు పోలీసులు, ఇటు మేజిస్ట్రేట్ తీరును హైకోర్టు తప్పుపట్టింది. కిషోర్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. ఆయన అరెస్ట్ సీఆర్‌పీసీ, బీఎన్‌ఎస్‌ఎస్ నిబంధనలతో పాటు సుప్రీంకోర్టు ఆదేశాలకు సైతం విరుద్ధమని తేల్చి చెప్పింది. ఇందులో ఎలాంటి సందేహం లేదంది. కిషోర్ రిమాండ్ విషయంలో మేజిస్ట్రేట్ మెదడు ఉపయోగించలేదని ఆక్షేపించింది.
బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయలేదు కాబట్టి, రిమాండ్ విధిస్తున్నట్లు పేర్కొన్న మేజిస్ట్రేట్, ఈ విషయంలో తన సంతృప్తిని ఎక్కడా రికార్డ్ చేయలేదని పేర్కొంది. కిషోర్ విడుదల ఈ వ్యాజ్యంలో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్‌తో కూడిన ధర్మాసనం గురువారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది.
