సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన మీద ఉన్న కేసులను కొట్టేయించుకుంటన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులు ఎందుకు మూసేస్తున్నారో తెలియజేయాలంటూ ఏపీ హైకోర్టు మంగళవారం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించింది.
ఫైబర్‌నెట్ కుంభకోణంతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులను న్యాయస్థానాలు కొట్టేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తు సంస్థ సిఫారసు మేరకు కోర్టులు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే కేసుల కొట్టివేత సమయంలో అభ్యంతరాలను న్యాయస్థానాలు సరిగా పరిగణనలోకి తీసుకోలేదంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయ్యాయి.
వీటిని విచారణకు స్వీకరించిన ఉన్నత న్యాయస్థానం.. కేసులు ఎందుకు మూసివేసారో, ఏ ఆధారాలపై ఉపసంహరణకు వెళ్లారో స్పష్టమైన వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 3వ తేదీన జరగనుంది.
ఏపీలో చంద్రబాబు అధికార దుర్వినియోగం పరాకాష్టకు చేరిందని.. ఈ క్రమంలోనే తనపై దాఖలైన కేసులను కొట్టేయించుకుంటున్నారని ఇటు వైఎస్సార్‌సీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.


