అగ్రిగోల్డ్‌ డిపాజిట్ల చెల్లింపులకు లైన్‌ క్లియర్ | AP Govt Has Taken Another Step In Order To Help Agrigold Victims | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌ రూ.20 వేల లోపు డిపాజిట్ల చెల్లింపులకు లైన్‌ క్లియర్

Nov 10 2020 5:14 AM | Updated on Nov 10 2020 8:51 AM

AP Govt Has Taken Another Step In Order To Help Agrigold‌ Victims - Sakshi

సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట మేరకు ఇప్పటికే రూ.10 వేల లోపు డిపాజిట్లు రూ.263.99 కోట్ల మేర చెల్లించిన సంగతి తెలిసిందే. తాజాగా రూ.20 వేల లోపు డిపాజిట్లు చెల్లించేందుకు తెలంగాణ హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. దీంతో మరోమారు డిపాజిట్ల చెల్లింపునకు ప్రభుత్వానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. వార్డు సచివాలయాల ద్వారా డిపాజిట్‌దారుల వివరాలను సీఐడీ సేకరిస్తుందని తెలంగాణ హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది.

సేకరించిన డిపాజిట్‌దారుల వివరాలను సీఐడీ డీఎస్పీ, ఆర్డీవో పరిశీలిస్తారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దరఖాస్తులను ధృవీకరిస్తారు. కలెక్టరేట్‌ ద్వారా అర్హులైన డిపాజిటర్లకు బ్యాంకు ఖాతాలో డబ్బును జమ చేస్తామని  ఏజీ శ్రీరామ్‌ కోర్టుకు వివరించారు. మార్చి 31 నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కాగా, అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలంపై తమ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆంధ్ర బ్యాంకు, ఎస్‌బీఐలు తెలంగాణ హైకోర్టు దృష్టికి తెచ్చాయి. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్‌ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ వేసింది. దీనిపై హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ (సీజే) నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం పేర్కొంది. 

Advertisement
 
Advertisement
Advertisement