
సాక్షి, చిత్తూరు: సాక్షి, చిత్తూరు: వెదురుకుప్పం మండలం దేవళం పేట(Devalampeta) ప్రధాన కూడలిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అక్కడి అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టడంతో స్థానిక సర్పంచ్ ఆధ్వరంలో దళిత సంఘాలు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో..
ఈ నిరసనలకు వైఎస్సార్‌సీపీ మద్దతు తెలిపింది. మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి, జీడి నెల్లూరు నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కృపాలక్ష్మీ అక్కడికి చేరుకుని దళిత సంఘాల నేతలకు సంఘీభావం ప్రకటించారు. అంతకు ముందు స్థానికులు వినూత్న రీతిలో తమ నిరసన తెలియజేశారు. నిందితుల్ని అరెస్ట్ చేయాలంటూ.. నగిరి డీఎస్పీ సయ్యద్ అజీజ్, వెదురుకుప్పం ఎస్సై వెంకటసుబ్బయ్య కాళ్ల మీద పడి వేడుకున్నారు.

దేవళం పేట(Devalampeta) ప్రధాన కూడలి లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి గత అర్ధరాత్రి ఎవరో నిప్పు పెట్టారు(Ambedkar Statue fire Incident). అయితే.. టీడీపీ నేత సతీష్ నాయుడు(TDP Leader Satish Naidu), అతని అనుచరులు చేసిన పనిగా అనుమానిస్తూ స్థానికులతో కలిసి దళిత నేతలు ఆందోళనకు దిగారు. ఘటనకు కారకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించారు.

విగ్రహానికి నిప్పు పెట్టినవాళ్లను అరెస్టు చేయని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని స్థానిక సర్పంచ్ చొక్కా గోవిందయ్య హెచ్చరిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదీ చదవండి: దేవరగట్టు కర్రల సమరం.. ఇద్దరు మృతి