
సాక్షి, విశాఖపట్నం: చందనోత్సవం ఘటన మరువకముందు సింహాద్రి అప్పన్న సన్నిధిలో మరో ప్రమాదం జరిగింది. తొలిపావంచా వద్ద గిరి ప్రదక్షిణ కోసం వేసిన భారీ రేకుల షెడ్డు కూలిపోయింది. ఈ సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

కూటమి ప్రభుత్వంలో ఆలయాల పట్ల, భక్తుల పట్ల వహిస్తున్న నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. సింహాద్రి అప్పన్న సన్నిధిలో శనివారం(జులై 5న) తొలిపావంచా వద్ద వేసిన భారీ రేకుల షెడ్డూ కూలిపోయింది. ఫోల్స్ క్రింద కాంక్రీట్ వేయక పోవడంతో బరువు ఎక్కువై షెడ్డు కూలిందని నిర్ధారణ అయ్యింది. షెడ్డు కింద ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 9వ తేదీన గిరి ప్రదక్షిణ జరగాల్సి ఉండగా.. ఇప్పుడు ఈ ప్రమాదంతో ఏర్పాట్లపై భక్తులు ఆందోళన చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా జరిగిన దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30వ తేదీన ఈదురు గాలితో నాసిరకం గోడ కూలిపోయి క్యూ లైన్‌లో ఉన్న భక్తుల మీద పడింది. ఆ ఘటనలో మరో 15 మందికి గాయాలయ్యాయి కూడా. ఇది మరువకముందు అదే ఆలయ ప్రాంగణంలో మరో ఘటన చోటుచేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అంతకు ముందు.. ఈ ఏడాది తిరుపతిలో జనవరి 8వ తేదీన వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ క్యూలైన్లలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతిచెందారు. 44 మంది తీవ్రంగా గాయపడ్డారు.
పవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాలు, అనూహ్య ఘటనలు భక్త కోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ.. వారి భద్రత పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తున్నాయి. ఇప్పుడు మరో ప్రమాదం.. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.