మాస్టర్స్ డిగ్రీ పూర్తి.. ఉద్యోగ వేటలో ఉండగా మృత్యువాత
బాపట్ల జిల్లా: ఆమె ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. తన డిగ్రీ పూర్తిచేసి మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. ఇంతలోనే మృత్యువు కబళించింది. ఛాతీలో నొప్పి, దగ్గు ఉన్నా పెద్దగా లెక్కచేయలేదు. దీంతో.. ఎప్పటిలాగే పడుకున్న ఆమె మరుసటి రోజు లేవలేదు. స్నేహితులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. వివరాలివీ..
బాపట్ల జిల్లా కారంచేడు గ్రామంలో చిన్న వ్యవసాయ కుటుంబానికి చెందిన యార్లగడ్డ రామకృష్ణ, వీణాకుమారిలకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమార్తె యార్లగడ్డ రాజ్యలక్ష్మి (23) ఇంజినీరింగ్ అయిన తరువాత ఎంఎస్ చేసేందుకు అప్పులుచేసి కుమార్తెను అమెరికాకు పంపించారు. తను కూడా ఎంతో కష్టపడి చదివి మాస్టర్స్ డిగ్రీ పొందింది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న ఆమెకు రెండు, మూడ్రోజులుగా దగ్గు, ఛాతీలో నొప్పి వచి్చనా పెద్దగా పట్టించుకోలేదు.
దీంతో ఆమె శుక్రవారం నిద్రలోనే మృతిచెందినట్లు తెలుస్తోంది. రాజ్యలక్ష్మి మృతి తల్లిదండ్రులతో పాటు, స్థానికులను కూడా కలచివేసింది. ఆమె మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎంతో కష్టపడి తనను మంచి స్థాయిలో చూడాలని ఆశపడిన తల్లిదండ్రుల కల నెరవేర్చకుండానే తనువు చాలించిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తంచేశారు. మృతదేహాన్ని అమెరికా నుంచి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు.


