ట్రాన్స్‌ఉమెన్‌కూ మహిళలతో సమాన హక్కులు | Andhra Pradesh High Court sensational verdict: Transwomen have equal rights with women | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ఉమెన్‌కూ మహిళలతో సమాన హక్కులు

Jun 22 2025 5:05 AM | Updated on Jun 22 2025 5:05 AM

Andhra Pradesh High Court sensational verdict: Transwomen have equal rights with women

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సంచలన తీర్పు 

సాక్షి, అమరావతి: ట్రాన్స్‌ఉమెన్‌ను స్త్రీగా పరిగణించకూడదనే వాదనను ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తప్పుపట్టింది. ట్రాన్స్‌ఉమెన్‌కు భారత రాజ్యాంగం ప్రకారం ఇతర మహిళలతో సమాన హక్కులుంటాయని డాక్టర్‌ జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప ఇటీవల సంచలన తీర్పునిచ్చారు.  అయితే, ఈ కేసులో ట్రాన్స్‌ఉమెన్‌ ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని స్పష్టం చేస్తూ, ఆమె తన భర్త, అత్తమామలపై పెట్టిన క్రిమినల్‌ కేసును హైకోర్టు కొట్టివేసింది. అయితే ఈ తీర్పు సందర్భంలో హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ట్రాన్స్‌ఉమెన్‌ హక్కుల చరిత్రలో కీలకమైనవిగా నిలవనున్నాయి.  

కేసు నేపథ్యం.. 
ఒంగోలుకు చెందిన ట్రాన్స్‌ఉమెన్‌ షబానా, చెన్నైకి చెందిన విశ్వనాథన్‌ కృష్ణమూర్తి ప్రేమించుకున్నారు. 2019లో హైదరాబాద్‌ ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజులే కలిసి జీవించిన ఈ దంపతులు తరువాత విడిపోయారు. ఈ క్రమంలో భర్త, అతని కుటుంబ సభ్యుల నుంచి హింస, అదనపు కట్నం కోసం  వేధింపులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ షబానా ఒంగోలు మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ కేసును కొట్టేయాలని నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వీరికి అనుగుణంగా తీర్పును వెలువరించింది. ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని తేల్చి చెప్పింది.  

‘స్త్రీ’ హోదాపై కీలక వ్యాఖ్యలు.. 
ఈ కేసులో పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదించిన ప్రధాన అంశాల్లో... ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులను అసలు మహిళలుగా పరిగణించరాదన్నది ఒకటి.  సంతానోత్పత్తి సామ­­­ర్థ్యం లేకపోవడమే ఇందుకు కారణమని వారు పేర్కొన్నారు. ఈ వాదన హైకోర్టు తిప్పికొట్టింది. ‘‘స్త్రీత్వాన్ని కేవలం సంతానోత్పత్తి సామర్థ్యంతో పరిమితం చేయలేం. ట్రాన్స్‌జెండర్‌ హక్కులను సుప్రీంకోర్టు గుర్తించడంతో పాటు, వారు తమ లైంగిక గుర్తింపును స్వయంగా నిర్ణయించుకునే హక్కు కల్పించింది.

ట్రాన్స్‌ఉమెన్‌కి ఐపీసీ సెక్షన్‌ 498ఏ కింద రక్షణ కల్పించాల్సిందే’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించా­రు. రాజ్యాంగ హక్కులు  పురుషులు, మహిళలకే పరి­మితం కావని, అవి ట్రాన్స్‌జెండర్లకు సైతం వర్తిస్తాయని సుప్రీంకోర్టు గతంలో తీర్పును ఇచ్చిన విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. ఈ తీర్పునకు అనుగుణంగా పార్లమెంట్‌ 2019లో ట్రాన్స్‌జండర్‌ వ్యక్తుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement