కేబినెట్ భేటీలో మాట్లాడుతున్న చంద్రబాబు
మేయర్, చైర్‌పర్సన్‌కు ప్రత్యక్ష ఎన్నిక
గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 34 శాతం
పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% బీసీ రిజర్వేషన్లు.. ఇక 28 జిల్లా పరిషత్‌లు
ఏపీఎస్‌బీసీఎల్ రూ.5,000 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ రుణానికి ఆమోదం
ప్రభుత్వ గ్యారెంటీతో రూ.9,000 కోట్ల అప్పులకు ఆమోదం
సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశంలో నిర్ణయాలు
సాక్షి, అమరావతి: పట్టణ స్థానిక సంస్ధల్లో మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. ఈ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం 1955 సెక్షన్ 90, ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీల చట్టం 1965 సెక్షన్ 23 సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీలకు గ్రామీణ స్థానిక సంస్ధల్లో 34 శాతం రిజర్వేషన్ కల్పించాలని, పట్టణ స్థానిక సంస్ధల్లో 33.33 శాతం రిజర్వేషన్లను కల్పించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండబోదని, ప్రస్తుతం అమల్లో ఉన్నవి యథాతథంగా కొనసాగుతాయని కేబినెట్ వెల్లడించింది. ౖబీసీ రిజర్వేషన్లకు సంబంధించి నియమించిన డెడికేటెడ్ కమిషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని అధికారులు కేబినెట్‌కు వెల్లడించారు. 13 జిల్లా పరిషత్‌ల స్థానంలో జిల్లాల విభజనకు అనుగుణంగా 28 జిల్లా పరిషత్‌ల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను పొందేందుకు పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను అత్యవసరంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కేబినెట్ అభిప్రాయపడింది.
కేబినెట్ తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఇలా..
⇒ ఏపీఎస్‌బీసీఎల్ రూ.5,000 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ రుణం తీసుకునేందుకు ఆమోదం. బేసిక్ ధర రూ.5,000 అంతకంటే ఎక్కువ ఉన్న కేటగిరీ మద్యం (ఐఎంఎఫ్‌ఎల్), వైన్, ఆర్‌టీడీ విదేశీ మద్యం టెండర్ల పరిశీలన నిబంధనల సవరణకు ఆమోదం.
⇒ పట్టణ స్థానిక సంస్ధల్లో రోడ్లు, డ్రైన్లు, సెంట్రల్ మీడియన్లు, వీధి దీపాలు, పార్కులు తదితర పనులను రూ.7,469.46 కోట్లతో హైబ్రీడ్ యాన్యుటీ మోడల్‌లో చేపట్టాలని నిర్ణయం. ఇందులో ప్రాజెక్టు వ్యయం రూ.5,500 కోట్లు కాగా వడ్డీ రూ.1,969.46 కోట్లకు పరిపాలన అనుమతి.
⇒ గ్రామీణ విద్యుదీకరణ సంస్థ రూ.2,500 కోట్ల అప్పులకు ప్రభుత్వ గ్యారెంటీకి ఆమోదం. ఆంధ్రప్రదేశ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ రూ.2,000 కోట్ల అప్పులకు ప్రభుత్వ గ్యారెంటీకి ఆమోదం. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.4,500 కోట్లు అప్పులకు ప్రభుత్వ గ్యారెంటీకి ఆమోదం.
⇒ హైకోర్టులో మీడియేషన్ సెంటర్ (14 పోస్టులు), హైకోర్టు ఆర్బిట్రేషన్ సెంటర్ (15 పోస్టులు) మొత్తం 29 పోస్టుల సృష్టికి ఆమోదం.
⇒ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ కార్యాలయం నుంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్–అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డిప్యుటేషన్ ప్రాతిపదికన హైకోర్టులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టు సృష్టికి ఆమోదం.
⇒ తిరుపతి రూరల్ మండలం దామినేడులో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఎకరం
రూ.2.50 కోట్ల చొప్పున ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్, హైదరాబాద్‌కు ఎకరం కేటాయింపు.
⇒ అవయవ మార్పిడి, దాన కార్యకలాపాలను నియంత్రించేందుకు ఆర్డినెన్స్ స్థానంలో ఆంధ్రప్రదేశ్ మానవ అవయవ మార్పిడి (సవరణ) చట్టం 2026 బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం.
⇒ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ చట్టం 2023 షెడ్యూల్‌లో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ చేర్చుతూ సవరణకు ఆమోదం.
⇒ వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఖాళీల ప్రత్యక్ష భర్తీకి అనుమతి.
⇒ రంపచోడవరం, మార్కాపురం, మదనపల్లె జిల్లా కేంద్రాల్లో హెచ్‌ఆర్‌ఏ 12 నుంచి 16 శాతానికి పెంపు, రాయచోటిలో ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ 16 శాతం రద్దుకు ఆమోదం.
⇒ ఉన్నత విద్య రెగ్యులేటరీ మానిటరింగ్ చట్టం 2019 సవరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం.
⇒ హంద్రీ నీవా సుజల స్రవంతి ఫేజ్ 2లో మిగిలిన పనులకు రూ.1,323.75 కోట్లతో పరిపాలన అనుమతి.
⇒ శ్రీసత్యసాయి జిల్లా మెయిన్ కాలువ లైనింగ్ పనులకు రూ.750.07 కోట్లు, అన్నమయ్య జిల్లాలో మెయిన్ కాలువ పనులకు రూ.573.68 కోట్లకు ఆమోదం.
⇒ ఇటీవల ఎస్‌ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం.


