అక్రమ మద్యం సరఫరాకు ఉపయోగించిన లారీ
ఇతర ప్రాంతాల నుంచి అక్రమ మద్యం సరఫరా
లారీలో గోవా మద్యం భారీగా స్వాధీనం..
ఇటీవల అద్దంకి వద్ద ఏకంగా పోలీసుల కారులోనే గంజాయి, మద్యం బాటిళ్లు లభ్యం
ములకలచెరువులో మొదలై విచ్చలవిడిగా సాగుతున్న టీడీపీ సిండికేట్ మద్యం దందా
తాడిపత్రి టౌన్: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కల్తీ మద్యం తయారీ, సిండికేట్ విక్రయాలు, అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నాయి. ప్రభుత్వ పెద్దల అండతో పచ్చ ముఠాలు బరి తెగించి అక్రమ విక్రయాలు సాగిస్తున్నాయి. గంజాయి ముఠాలు రోజుకో చోట మహిళలపై అఘాయిత్యాలకు తెగబడుతున్నాయి. టీడీపీ సిండికేట్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ విచ్చలవిడిగా కల్తీ మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నాయి. నాడు ములకలచెరువు నుంచి నేడు తాడిపత్రి దాకా ఇదే కథ! 2025 అక్టోబర్ 3న ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టు రట్టు కావడం తీవ్ర కలకలం రేపడం తెలిసిందే.
గత ఎన్నికల్లో తంబళ్లపల్లె నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన డి.జయచంద్రారెడ్డి సన్నిహితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నకిలీ మద్యం డంప్ బహిర్గతం కాగానే ఆయన ఆఫ్రికాకు పరారై కొన్నాళ్లు అక్కడే గడిపారు. ములకలచెరువులో వివిధ రకాల బ్రాండ్లను పోలిన నకిలీ మద్యం బాటిళ్లు, నకిలీ మద్యం తయారీ సామగ్రి సహా ప్లాంట్‌ను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. తాజాగా అద్దంకి వద్ద ఏకంగా పోలీసుల కారులోనే గంజాయి, మద్యం బాటిళ్లు దొరకడం రెడ్‌బుక్ రాజ్యాంగంలో అక్రమాలకు పరాకాష్ట.
తాడిపత్రిలో గోవా మద్యం స్వాధీనం..
తాడిపత్రిలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది. ఇతర ప్రాంతాల నుంచి అక్రమ మద్యం భారీగా తాడిపత్రికి చేరవేస్తున్నారు. సోమవారం రాత్రి తాడిపత్రి శివారు
అనంతపురం ప్రధాన రహదారిపై రైల్వే ఫ్లైఓవర్ వద్ద ఓ లారీలో 400కిపైగా మద్యం ఫుల్ బాటిళ్లు పట్టుబడినట్లు తెలుస్తోంది. లారీ క్యాబిన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సీక్రెట్ బాక్స్‌లో దాచిన మద్యం బాటిళ్లను గోవా నుంచి తరలిస్తుండగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కర్ణాటక, ఏపీ రిజిస్ట్రేషన్‌తో లారీలో రెండు నంబర్ ప్లేట్లు ఉన్నట్లు గుర్తించారు. తనిఖీలు తప్పించుకునేందుకు రెండు నంబర్ ప్లేట్లను వినియోగిస్తున్నట్లు వెల్లడైంది.
నిందితులు తప్పించుకున్నారా.. తప్పించారా?
తాడిపత్రిలో భారీగా గోవా మద్యం లభ్యం కాగా నిందితులు పరారైనట్లు పోలీసులు చెబుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాడిపత్రి ప్రాంతానికి చెందిన పది మంది దాకా ముఠాగా ఏర్పడి ఇతర ప్రాంతాల నుంచి అక్రమంగా మద్యాన్ని తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులకు వేల సంఖ్యలో మద్యం బాటిళ్లు దొరికినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. మద్యం తరలిస్తున్న లారీని స్టేషన్ వద్ద కాకుండా ప్రైవేట్ స్థలంలో ఉంచామని పోలీసులు చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది. మద్యం అక్రమ రవాణా కేసు నుంచి తప్పించడంతోపాటు పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నట్లు తాడిపత్రిలో జోరుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో ప్రెస్‌మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ ఆరోహణరావు తెలిపారు.


