కేసును కోర్టు కొట్టేస్తే ఉద్యోగిని విధుల్లోకి తీసుకోవాల్సిందే

Andhra Pradesh High Court On Case on Employee - Sakshi

అవే ఆరోపణలపై తీసుకున్న శాఖాపరమైన చర్యలు చెల్లవు

తొలగింపు తేదీ నుంచి నిర్దోషిగా తేలేవరకు జీతభత్యాలకు అర్హుడు కాదు

ఆ తరువాత నుంచి అన్ని ప్రయోజనాలకు అర్హుడే

హైకోర్టు ధర్మాసనం తీర్పు

హైకోర్టు తీర్పుతో 28 ఏళ్లకు తిరిగి ఉద్యోగం దక్కించుకున్న ఖాసిం సాహెబ్‌

ట్రిబ్యునల్‌ తీర్పును, అధికారుల ఉత్తర్వులను రద్దు చేసిన హైకోర్టు

సాక్షి, అమరావతి : ఏ ఆరోపణలతో శాఖాపరమైన విచారణ జరిపి ఉద్యోగిని సర్వీసు నుంచి తొలగించారో అదే ఆరోపణలపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేసినప్పుడు ఆ ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. న్యాయస్థానం అతన్ని నిర్దోషిగా విడుదల చేసినప్పుడు అదే ఆరోపణలపై సర్వీసు నుంచి తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది. ఇలా కర్నూలు జిల్లా, నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో టైపిస్ట్‌ ఖాసిం సాహెబ్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.

తనను సర్వీసు నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ ఖాసిం సాహెబ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ పరిపాలన ట్రిబ్యునల్‌ జారీ చేసిన ఉత్తర్వులను సైతం హైకోర్టు రద్దు చేసింది. ఖాసింను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అయితే సర్వీసులోని తొలగించిన తేదీ నుంచి నిర్దోషిగా తేలిన తేదీ వరకు నో వర్క్, నో పే సూత్రం ఆధారంగా ఎలాంటి జీతభత్యాలకు అర్హుడు కాదని స్పష్టం చేసింది. నిర్దోషిగా తేలిన నాటి నుంచి సర్వీసులో చేరేంత వరకు అన్ని ప్రయోజనాలకు అర్హుడని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్, జస్టిస్‌ వెణుతురుమిల్లి గోపాలకృష్ణారావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. దీంతో సర్వీసు నుంచి తొలగింపునకు గురైన 28 ఏళ్లకు ఖాసిం తిరిగి ఉద్యోగంలో చేరుతున్నారు.

రూ.69 వేల దుర్వినియోగం ఆరోపణలు
నందికొట్కూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయంలో టైపిస్ట్‌ డి.ఖాసిం సాహెబ్‌ ఇతర ఉద్యోగుల సంతకాలు ఫోర్జరీ చేసి డూప్లికేట్‌ రసీదులతో రూ.69 వేల మేర నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 1988లో స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఖాసిం దుర్వినియోగానికి పాల్పడినట్లు శాఖాపరమైన విచారణలో తేలింది. దీంతో 1995లో అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఇదిలా ఉండగానే ఖాసింపై పోలీసులు నమోదు చేసిన కేసును నందికొట్కూరు జూనియర్‌ ఫస్ట్‌ క్లాజ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు 1997లో కొట్టివేసింది. దీనిపై పోలీసులు హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేయగా, దానిని హైకోర్టు 1998లో కొట్టేసింది.

ఈ నేపథ్యంలో తనను ఉద్యోగం నుంచి తొలగిస్తూ మార్కెట్‌ కమిటీ పర్సన్‌ ఇన్‌చార్జి ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ ఖాసిం 2001లో ఏపీ పరిపాలన ట్రిబ్యునల్‌ (ఏపీఏటీ)లో పిటిషన్‌ వేశారు. ఖాసిం రెండున్నరేళ్లు జాప్యం చేశారన్న కారణంతో అతని పిటిషన్‌ను 2003లో పరిపాలన ట్రిబ్యునల్‌ కొట్టేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ 2003లో ఖాసిం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ ధర్మాసనం ఇటీవల తుది విచారణ జరిపి, తీర్పు వెలువరించింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top