చిన్న సినిమాలకు ప్రభుత్వం సహకారం

Andhra Pradesh Government support for small films - Sakshi

థియేటర్లు దొరకని చిన్న సినిమాలకు ఏపీ ఫైబర్‌నెట్‌ చేయూత 

రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ 

ఏపీ ఫైబర్‌నెట్‌ ‘ఫస్ట్‌డే.. ఫస్ట్‌ షో’ ప్రారంభం

సాక్షి, విశాఖపట్నం: థియేటర్లు దొరక్క ఇబ్బందు­లు పడుతున్న చిన్న సినిమాలకు రాష్ట్ర ప్రభు­త్వం సహకారం అందిస్తోందని, అందులో భా­గం­గానే ‘ఫస్ట్‌ డే.. ఫస్ట్‌ షో’ను ప్రారంభించిందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చెప్పారు. ఏపీ ఫైబర్‌నెట్‌ ఆధ్వర్యంలో సిని­మా విడుదలైన రోజునే ఇంట్లోనే కూర్చొని వీక్షించేలా రూపొందించిన ఈ కార్యక్రమాన్ని మంత్రి అమర్‌నాథ్‌ శుక్రవారం విశాఖలో లాంఛనంగా ప్రారంభించారు.

ఈ ప్రోగ్రామ్‌ ద్వారా తొలి సి­ని­మాగా నిరీక్షణ చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫైబర్‌నెట్‌ సే­వ­లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నారని, ఇప్పటికే 8 వేల పంచాయతీలకు ఈ సేవలు అందుబాటులోకి తెచ్చారని చెప్పారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏడాదికి 100 సినిమాలు షూటింగ్‌ పూర్తి చేసుకుంటే.. అందులో 20 మాత్రమే విడుదలవుతున్నాయని, మిగిలినవన్నీ ల్యాబ్‌లకే పరిమితమవుతున్నాయ­ని విచారం వ్యక్తం చేశారు.

ఏపీ ఫైబర్‌నెట్‌ ద్వా­రా కొత్త సినిమా రిలీజ్‌ అయిన రోజునే 99 రూ­పాయిలకే 24 గంటలపాటు ఇంట్లో నుంచి చూసే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌) చైర్మ­న్‌ గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల ముంగిటకే పరిపాలన తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. ఇప్పుడు ప్రజల ఇంటికే కొత్త సినిమాను తెస్తున్నారన్నారు. సినిమా డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇబ్బందులు పడకుండా త్వరలోనే ట్రై పార్టీ అగ్రిమెంట్‌కు విధివిధానాలు సిద్ధం చేస్తున్నామని తె­లి­పారు.

నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ చిన్న సినిమాల్ని ఆదరించేలా, ప్రొడ్యూసర్లకి చేయూ­తనందించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపా­రు. దీనివల్ల థియేటర్లకు ఎలాంటి నష్టం లేదన్నారు. ఇది క్లిక్‌ అయితే ఆరు నెలల్లోనే పెద్ద సిని­మాల ప్రొడ్యూసర్లు కూడా ఫైబర్‌నెట్‌ను ఆశ్రయిస్తారని చెప్పా­రు. నిరీక్షణ చిత్ర నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ పెద్ద సినిమాలకు లా­భాలు వచ్చేందుకు అనేక దారులుంటాయని, చిన్న సినిమాలకు ఇప్పు­డే దారి దొరికిందని అన్నారు.

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశ పెట్టిన నవరత్నాల తర్వాత 10వ రత్నం ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో అని కొనియాడారు. భవిష్యత్తులో ఫైబర్‌నెట్‌ కోసం సినిమాలు తీసే రోజులు వస్తాయ­ని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, ఏపీ క్రియేటివిటీ అండ్‌ కల్చరల్‌ కమిషన్‌ క్రియేటివ్‌ హెడ్‌ జోగినాయుడు, ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ ఎండీ మధుసూధన్‌రెడ్డి, నిరీక్షణ హీరో సాయిరోనక్, డైరెక్టర్‌ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top