'పవర్‌' ఢమాల్‌! | EPDCL grading has deteriorated | Sakshi
Sakshi News home page

'పవర్‌' ఢమాల్‌!

Jan 27 2026 5:34 AM | Updated on Jan 27 2026 5:34 AM

EPDCL grading has deteriorated

దిగజారిన ఈపీడీసీఎల్‌ గ్రేడింగ్‌  

ఏ గ్రేడ్‌ నుంచి బీ గ్రేడ్‌కు పతనం 

కేంద్రం విడుదల చేసిన 13వ వార్షిక గ్రేడింగ్‌ నివేదికలో వెల్లడి 

2024లో 65.12 మార్కులు.. తాజాగా 50.46 మార్కులకు తగ్గుదల 

ఆర్థిక సంక్షోభం, అంతర్గత నిర్వహణ లోపాలే ప్రధాన కారణం 

కార్పొరేట్‌ కార్యాలయంలో మితిమీరిన జోక్యం, పెత్తనం

సాక్షి, విశాఖపట్నం: విభిన్న సంస్కరణలతో ఏడాదిన్నర కిందటి వరకు విద్యుత్‌ రంగంలో ఆదర్శంగా నిలిచిన తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్‌) ప్రస్తుతం తీవ్ర గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించిన 13వ వార్షిక సమీకృత గ్రేడింగ్‌ నివేదికలో సంస్థ పనితీరు భారీగా దిగజారడం ఆందోళన కలిగిస్తోంది. 2023–24లో మెరుగైన స్థానంలో నిలిచిన ఈపీడీసీఎల్, 2024–25 నాటికి తన స్థానాన్ని కోల్పోయి ‘ఏ’ గ్రేడ్‌ నుంచి ‘బీ’ గ్రేడ్‌కు పడిపోయింది. కేంద్రం విడుదల చేసిన ‘రెడ్‌ కార్డ్‌ మెట్రిక్స్‌’ జాబితాలో సంస్థ చేరడం అంతర్గత ఆర్థిక సంక్షోభానికి అద్దం పడుతోంది. డిస్కంల నిర్వహణను చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేయడం, ఈపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంలో ఎవరికి వారే పెత్తనం చెలాయించడం ఈ పతనానికి ప్రధాన కారణాలుగా మారాయి.  

పడిపోయిన స్కోరు  
కేంద్రం నిర్ణయించిన 100 మార్కుల మూల్యాంకనంలో ఏపీఈపీడీసీఎల్‌ సాధించిన మార్కులు చూస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. 2023–24లో 65.12 మార్కులతో ఉన్న సంస్థ.. ఇప్పుడు కేవలం 50.46 మార్కులకే పరిమితమైంది. గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని ఇతర డిస్కంలతో పోలిస్తే ఈపీడీసీఎల్‌ అగ్రభాగంలో ఉండేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంస్థలో రాజకీయ నియామకాలు పెరగడం, ప్రతి విషయంలోనూ ప్రజాప్రతినిధులు తలదూర్చడంతో ఈపీడీసీఎల్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీనికి తోడు పెరుగుతున్న నష్టాలు, పేరుకుపోతున్న అప్పులు కూడా గ్రేడింగ్‌ తగ్గడానికి కారణమయ్యాయి. ఆడిటర్ల ప్రతికూల నివేదికలు, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకత లోపించడం వల్ల కేంద్రం ఈ సారి కఠినంగా వ్యవహరించింది. దేశవ్యాప్తంగా 8 డిస్కంలకు రెడ్‌ కార్డ్‌ జారీ చేయగా, అందులో ఈపీడీసీఎల్‌ ఉండటం దురదృష్టకరం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ పంపిణీ వ్యవస్థల పనితీరు ఎంతలా దిగజారాయో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రెడ్‌ కార్డ్‌ మెట్రిక్‌ జారీ చేయడం.. రాష్ట్ర విద్యుత్‌ రంగ నిర్వహణతో పాటు ఈపీడీసీఎల్‌పై మాయని మచ్చగా మారింది. 

కార్పొరేట్‌ కార్యాలయంలో పెత్తనాలు 
ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోనే అత్యుత్తమ డిస్కంలలో ఒకటిగా పేరొందిన ఏపీఈపీడీసీఎల్, నేడు కేంద్రం నుంచి హెచ్చరికలు పొందే స్థాయికి పడిపోవడం పాలనాపరమైన వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. ముఖ్యంగా కార్పొరేట్‌ కార్యాలయంలో ఒక ఈఈ స్థాయి ఉద్యోగి అనధికారికంగా ఉన్నతాధికారిగా వ్యవహరిస్తూ.. ఆర్థిక, పరిపాలన, బదిలీలు, పదోన్నతులు వంటి కీలక అంశాల్లో తలదూర్చుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సీఎండీ పేషీలో పరిపాలన క్రమశిక్షణ లోపించిందని, ఏ విషయాన్నైనా సీఎండీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం లేకుండా పేషీ స్థాయిలోనే నిర్ణయాలు జరిగిపోతున్నాయని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏడాది సంస్థ ‘సీ’గ్రేడ్‌కు పడిపోయినా ఆశ్చర్యం లేదని వారు అంటున్నారు. విశాఖ సర్కిల్‌ పరిధిలో స్థానిక టెండర్ల విషయంలోనూ అవకతవకలు జరుగుతున్నాయని, నామినేషన్‌ పద్ధతిలో తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు పనులు కట్టబెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సామాన్యుడిపై పడనున్న భారం?
గ్రేడింగ్‌ పడిపోవడం కేవలం గణాంకాలకు సంబంధించిన విషయం కాదు. ఇది ఈపీడీసీఎల్‌ పరిధిలోని లక్షల మంది వినియోగదారులపై ప్రభావం చూపనుంది. సంస్థ ఆర్థికంగా దివాలా తీసే స్థితికి చేరుకోవడం వల్ల, ఆ లోటును పూడ్చుకోవడానికి ప్రభుత్వం, డిస్కంలు వినియోగదారులపై భారం మోపే ప్రమాదం ఉంది. గ్రేడింగ్‌ తగ్గడం వల్ల ఈపీడీసీఎల్‌కు మార్కెట్లో కొత్త రుణాలు లభించడం కష్టమవుతుంది. ఒకవేళ రుణాలు దొరికినా అధిక వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ అదనపు భారాన్ని ‘టారిఫ్‌ సవరణ’లేదా ‘ట్రూ–అప్‌’ చార్జీల రూపంలో సామాన్య వినియోగదారుడిపైనే రుద్దే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రాజకీయాలకు అతీతంగా విద్యుత్‌ రంగ నిపుణులతో సమీక్ష జరిపి, ఆర్థిక క్రమశిక్షణను పునరుద్ధరించకపోతే డిస్కం మనుగడ ప్రశ్నార్థకమయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

నష్టాల ఊబిలో ఈపీడీసీఎల్‌  
సంస్థ వార్షిక నష్టం రూ.7,155 కోట్లుగా నమోదవగా, మొత్తం రుణాలు రూ. 20,693 కోట్లకు చేరాయి. జెన్‌కో, ట్రాన్స్‌కో వంటి సరఫరా సంస్థలకు నిర్ణీత 60 రోజుల్లోపు బిల్లులు చెల్లించడంలో విఫలం కావడం వల్ల స్కోరింగ్‌లో భారీగా కోత పడింది. సరైన ఆర్థిక నిర్వహణ వ్యవస్థ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం, తీసుకున్న నిర్ణయాలను అమలు చేయకపోవడం వంటి కారణాల వల్ల సంస్థ నష్టాల్లో కూరుకుపోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి రావాల్సిన రూ. కోట్లాది బకాయిలను వసూలు చేయడంలోనూ అధికారులు విఫలమవుతున్నారు. సాంకేతిక, వాణిజ్య నష్టాలను(ఏటీ అండ్‌ సీ) తగ్గించడంలో ఆశించిన పురోగతి లేకపోవడం కూడా గ్రేడింగ్‌ పతనానికి మరో కారణంగా అధికార వర్గాలు భావిస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement