పాఠశాల స్థాయిలోనే జానపద నృత్య పోటీలు | - | Sakshi
Sakshi News home page

పాఠశాల స్థాయిలోనే జానపద నృత్య పోటీలు

Sep 27 2026 1:40 AM | Updated on Sep 27 2026 1:40 AM

అనంతపురం ఎడ్యుకేషన్‌: విద్యార్థుల్లో సృజనాత్మకత, జీవన నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన, గౌరవాన్ని పెంపొందించేందుకు పాఠశాల స్థాయిలో రోల్‌ ప్లే, జానపద నృత్య పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ అయూబ్‌ హుస్సేన్‌ తెలిపారు. ఈ పోటీలకు విద్యార్థులు సిద్ధం కావాలని ఆయన సూచించారు. డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌.రామకృష్ణతో కలిసి రోల్‌ ప్లేకు సంబంధించిన కేలండర్‌ను ఆవిష్కరించారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలలు, కేజీబీవీల్లో 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థులు జానపద నృత్య పోటీల్లో, 9వ తరగతి విద్యార్థులు రోల్‌ ప్లే పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. జానపద నృత్య ప్రదర్శనలో 4 నుంచి 6 మంది విద్యార్థులు ఉండాలని, ప్రదర్శన 5 నుంచి 6 నిమిషాల వ్యవధిలో ఉండాలని సూచించారు. రోల్‌ ప్లే, జానపద నృత్య ప్రదర్శనల్లో ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, బాధ్యతాయుత పౌరసత్వం,లింగ సమానత్వం, మాదకద్రవ్యాల నివారణ, మానసిక ఆరోగ్యం, భద్రత తదితర అంశాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు ఉండాలని డీఈఓ తెలిపారు.

మూడు అంచెల్లో పోటీలు

2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అక్టోబర్‌ 10లోపు పాఠశాల, మండల స్థాయి పోటీలు, అక్టోబర్‌ 25లోపు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికై న విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా నోడల్‌ అధికారి ఎం.లక్ష్మీనారాయణరెడ్డి, అనంతపురం జిల్లా నోడల్‌ అధికారి బి.శ్రీనివాసులు, డైట్‌ అధ్యాపకులు పాల్గొన్నారు.

వాతావరణానికి

అనుగుణంగా ‘సాగా’లి

● రైతులకు శాస్త్రవేత్తల సూచన

బుక్కరాయసముద్రం: రైతులు వాతావరణానికి అనుగుణంగా పంటలు సాగు చేయాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ నారాయణస్వామి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానంలో వాతావరణ పరిస్థితులు, పంటల సాగుపై శాస్త్రవేత్తలు సమావేశం నిర్వహించారు. ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ నారాయణ స్వామి మాట్లాడుతూ రైతులు పంటల సాగులో యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. శాస్త్రవేత్తల సూచనల మేరకు పంటలను సాగు చేయాలన్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు తేమను ఉపయోగించుకుని ఉలవ, శనగ, అలసంద పంటలను సాగు చేసుకోవచ్చన్నారు. జిల్లాలో రైతులు సాగు చేసిన పంటలపై చర్చించారు. అనంతరం రేకులకుంట పరిశోధనా స్థానంలో రైతులు సాగు చేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. కార్యక్రమంలో డీఏఓ సాలిరెడ్డి, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ తిమ్మారెడ్డి, రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్‌, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

ఐచర్‌ కిందకు దూసుకెళ్లిన బైక్‌

● ఇద్దరికి త్రుటిలో తప్పిన ప్రాణాపాయం

కూడేరు: అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారిపై శనివారం సాయంత్రం కూడేరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మండల పరిధిలోని మరుట్ల–2వ కాలనీకి చెందిన జయసింహా, సోము అనే ఇద్దరు యువకులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. స్థానికులు అందించిన వివరాల మేరకు.. ఇద్దరు యువకులు కూడేరులో ద్విచక్ర వాహనానికి పెట్రోల్‌ వేయించుకొని మరుట్లకు బయలు దేరారు. స్టేట్‌ బ్యాంక్‌ వద్దకు రాగానే అనంతపురం వెళదామని అనుకొని సడన్‌గా ద్విచక్రవాహనాన్ని జయసింహా తిప్పాడు. వెనక కూర్చున్న సోము ఎదురుగా వస్తున్న ఐచర్‌ను గమనించి పక్కకు దూకేశాడు. క్షణాల్లో ద్విచక్ర వాహనం ఐచర్‌ వాహనం కిందకు దూసుకెళ్లింది. ఐచర్‌ డ్రైవర్‌ బ్రేక్‌ వేయడంతో వాహనం ఆగింది. జయసింహా పక్కకు ఎగిరిపడగా మొహానికి స్వల్పంగా గాయలయ్యాయి. టైర్ల కిందపడింటే ప్రాణానికి ముప్పు వాటిల్లేది. హెల్మెట్‌ ధరించి ఉంటే ఆ గాయాలు కూడా అయ్యేవి కావు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడ్డ జయసింహాని పక్కకు తీసుకెళ్లి, ఐచర్‌ కిందకు దూరిన ద్విచక్ర వాహనాన్ని బయటకు తీసి ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూశారు. జయసింహా స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement