తాడిపత్రిటౌన్: తాడిపత్రి నియోజకవర్గంలో అపార ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. అటువంటి నిక్షేపాలు అధికార టీడీపీ నాయకులకు ఆదాయ వనరుగా మారాయి. పెద్దవడుగూరు మండలం కొండుపల్లి, క్రిష్టిపాడు, లక్ష్ముంపల్లి, పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట, యాడికి మండలం రాయలచెరువు, వెంగన్నపల్లి, చందన గ్రామాల్లో దాదాపు 70 వరకు తెల్లసుద్ద (స్టీటైట్) అండర్‌గ్రౌండ్, ఓపెన్‌కాస్ట్ మైనింగ్‌లు ఉన్నాయి. ఇందులో అనుమతులు ఉన్న గనులు 40 వరకు ఉంటాయి. మిగిలిన గనుల్లో అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్నారు.
నిబంధనలు బేఖాతరు..
గనుల్లో ఖనిజం ఉన్న రాయి గట్టిగా ఉంటే సాధారణ యంత్రాలతో తవ్వడం కష్టం. అలాంటి సమయంలో రాయిని చిన్న ముక్కలుగా చేయడానికి పేలుడు పదార్థాలు అమర్చి బ్లాస్టింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే బ్లాస్టింగ్‌కు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. అది కూడా పేలుడు పదార్థాలను పరిమితంగా వాడాలి. ప్రత్యేక స్థలాల్లో నిల్వ చేయాలి. కానీ ఇక్కడ నిర్వాహకులు పరిమితికి మించి పేలుడు పదార్థాలను కొనుగోలు చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇళ్ల మధ్యే నిల్వ చేస్తున్నారు. మరికొంతమంది గనుల్లోనే రహస్య ప్రదేశాల్లో ఉంచుతున్నారు. గనిలో ప్రత్యేక శిక్షణ పొందిన బ్లాస్టర్‌తోనే పేలుళ్లు చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ సాధారణ కార్మికులకే బ్లాస్టింగ్ పనులు అప్పగిస్తున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. చాలామంది కాళ్లు, చేతులు కోల్పోయి వైకల్యం బారినపడుతున్నారు.
పర్యవేక్షించని అధికారులు..
నంద్యాల జిల్లా డోన్, అనంతపురం జిల్లా నార్పలలో కొందరు వ్యక్తులు పేలుడు సామగ్రిని అనధికారికంగా మైనింగ్ నిర్వాహకులకు సరఫరా చేస్తున్నారు. ఈ విషయం స్థానిక పోలీస్ అధికారులకు తెలిసినా పట్టనట్టుగా ఉంటున్నారు. మైనింగ్ నిర్వహణను పరిశీలించాల్సిన అధికారులు మామూళ్లు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
కార్మికుల ప్రాణాలతో చెలగాటం..
గనుల్లో బ్లాస్టింగ్ సమయంలో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే బాధిత కార్మిక కుటుంబాలకు యాజమాన్యం కొంత మొత్తం అందజేసి విషయం బయటకు పొక్కకుండా చేస్తున్నారు. కొంతకాలం క్రితం పెద్దవడుగూరు మండలం కొండుపల్లిలో బ్లాస్టింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో యాడికి మండలం తూట్రాళ్లపల్లి నాగయ్య, హరిక్రిష్ణ, రామరాజుపల్లికి చెందిన మంగళ కొండప్ప, కొండుపల్లి గ్రామానికి చెందిన తిరుపాలు గాయాలపాలయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న కొండుపల్లి గనుల్లో జరిగిన బ్లాస్టింగ్ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. కొన్నేళ్ల క్రితం గని ప్రమాదంలో క్రిష్టిపాడు ఎస్సీ కాలనీకి చెందిన వీరాంజినేయులు కాళ్లు, చేతులు కోల్పోయాడు. కోనాపురానికి చెందిన గని కార్మికుడు కంబగిరిస్వామి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
అధికారం ముసుగులో ‘పచ్చ’ నేతలు గనులపై వాలిపోతున్నారు. కొందరు అనుమతికి మించి.. మరికొందరు
అక్రమ తవ్వకాలతో చెలరేగిపోతున్నారు. భద్రతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చి.. పైసా ఖర్చు కాకుండా.. సాధారణ కార్మికులతో గనుల్లో బ్లాస్టింగ్ చేయిస్తున్నారు. అనుభవం లేని కారణంగా కార్మికులు తరచూ ప్రమాదాలకు
గురవడం.. ప్రాణాలు కోల్పోవడం పరిపాటిగా మారింది. అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్లు తీసుకుని మిన్నకుండిపోతున్నారు.
యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు
నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగులు
కార్మికుల ప్రాణాలతో
చెలగాటమాడుతున్న నిర్వాహకులు
తెలిసినా పట్టించుకోని
పోలీసు, మైనింగ్ అధికారులు


