అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో భాగంగా అందుతున్న క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై సూక్ష్మపరిశీలన ముఖ్యమని జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ జి.సి.కిషోర్‌కుమార్ స్పష్టం చేశారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై ఆయన ఆదివారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో కలెక్టర్ ఆనంద్‌తో కలిసి ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో సూపర్ చెక్ నిర్వహించారు. జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ లాగిన్‌లోకి వచ్చిన ఓటరు చేర్పునకు సంబంధించి 97 క్లెయిమ్‌లు, వివరాల మార్పునకు సంబంధించి 75 క్లెయిమ్‌లు, ఓటు తొలగింపునకు సంబంధించి 9 క్లెయిమ్‌లను సూపర్ చెక్ చేసి, తగిన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. సమావేశంలో ఈఆర్‌ఓలు ప్రేమంత్‌కుమార్, వసంతబాబు, రామ్మోహన్, రమేష్‌రెడ్డి, వెంకటనారాయణ, రవిశంకర్‌రెడ్డి, కిరణ్మయి, ఏఈఆర్‌ఓలు, ఎన్నికల డీటీ, ఎస్‌ఏ, ఈడీటీలు పాల్గొన్నారు.
క్షేత్రస్థాయి పరిశీలన
రాప్తాడు రూరల్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్–2026) ప్రక్రియలో భాగంగా వచ్చిన క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారంపై జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ జీసీ కిషోర్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆదివారం అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఏ.నారాయణపురం–2 స్వర్ణ గ్రామ సచివాలయం, విద్యారణ్యనగర్, పాపంపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను సందర్శించారు.
పంటల బీమా
ప్రీమియం మాయం
● ఇన్సూరెన్స్ కంపెనీకి జమకాని వైనం
● ఇదీ ఆంధ్రాబ్యాంకు సిబ్బంది నిర్వాకం
● నిలదీస్తే.. రైతుల ఖాతాలకు వెనక్కు
కళ్యాణదుర్గం రూరల్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికందకపోతే పంటల బీమా ఆదుకుంటుందనే ఆశతో రైతులు ప్రీమియం చెల్లించారు. అయితే బ్యాంకు అధికారులు ఆ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి జమ చేయలేదు. ఆ నగదును స్వాహా చేసేశారు. రైతులు నిలదీయడంతో.. చేసేదిలేక ప్రీమియం మొత్తాలను తిరిగి వ్యక్తిగత ఖాతాల్లోకి వెనక్కు వేశారు. వివరాల్లోకెళ్తే.. కళ్యాణదుర్గం మండలంలో ఖరీఫ్ కింద వివిధ రకాల పంటలు సాగయ్యాయి. చాపిరి, విరుపాపల్లి, శీర్పి తదితర గ్రామాల్లో టమాట, కంది, అరటి, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేసిన రైతులు వాతావరణ ఆధారిత పంటల బీమా కింద కళ్యాణదుర్గం యూనియన్ (ఆంధ్రా)బ్యాంకులో జూలై 15వ తేదీలోపు ప్రీమియం చెల్లించారు. వారం కిందట చాపిరి సచివాలయంలో బీమా ప్రీమియం చెల్లించిన రైతుల జాబితాను ప్రదర్శించారు. ఇందులో సుమారు వంద మంది రైతుల పేర్లు కనిపంచలేదు. ఇదేమని ఆర్‌ఎస్‌కే సిబ్బందిని అడిగితే బ్యాంకును సంప్రదించాలని చెప్పారు. అక్కడికెళ్లి అడిగితే తమకు సంబంధం లేదని, ఇన్సూరెన్స్ కంపెనీ వారిని అడగండని సలహా ఇచ్చారు. అయితే ప్రీమియం డబ్బు ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించినట్టుగా ఎటువంటి ఆధారమూ వారు చూపలేదు. ఈ క్రమంలో బ్యాంకుకు వచ్చే బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు, సిబ్బందిలో ఆందోళన మొదలైంది. ఈ వ్యవహారం తమ మెడకు చుట్టుకునే అవకాశం ఉందని భావించి బాధిత రైతుల ఖాతాలకు ఆదివారం ప్రీమియం డబ్బును వెనక్కు వేశారు. టెక్నికల్ సమస్య వల్ల జమ చేయలేకపోయాం అంటూ మొబైల్‌కు మెసేజీలు పంపారు. వంద మంది రైతులు ప్రీమియం రూపంలో చెల్లించిన నగదు రూ.5లక్షల దాకా ఉంటుందని అంచనా. ప్రభుత్వం పంటల బీమా వర్తింపజేస్తే.. రూ.కోట్లల్లో పరిహారం అందించాల్సి ఉండేది. ఇప్పుడు ఆ అవకాశాన్ని రైతులు కోల్పోయారు. దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా బ్యాంకు అధికారులు స్పందించలేదు.


