అనంతపురం అగ్రికల్చర్: మరో మూడు రోజుల్లో రబీ ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో ఎక్కువగా నల్లరేగడి భూముల్లో పప్పుశనగ సాగు చేస్తారు. అందునా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలో మరీ ఎక్కువ. అక్టోబర్‌లో వర్షం వస్తే జిల్లా వ్యాప్తంగా 60 వేల హెక్టార్లలో పప్పుశనగ సాగులోకి రావచ్చని అధికారికంగా అంచనా వేసినా.. అంతకు మించి సాగయ్యే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం గత ఏడాది అదను దాటాక నవంబర్ మొదటి వారంలో కంటితుడుపు చర్యగా రాయితీని 25 శాతానికి కుదించి నామమాత్రంగా 2వేల క్వింటాళ్ల విత్తన పప్పుశనగ పంపిణీ చేసింది. మరి ఈ సీజన్‌లో అయినా సకాలంలో అందించాలని రైతులు కోరుతున్నారు.
ముందస్తు సాగుకు సిద్ధం..
ఇటీవల జిల్లా వ్యాప్తంగా వర్షాలు రావడంతో ముందస్తు పంట సాగుకు సిద్ధమయ్యారు. దీనికి తోడు ఖరీఫ్ పంట ఆశలు గల్లంతు కావడం, ఇంకా పంట వేసుకోలేక బీళ్లుగా పెట్టుకున్నందున నల్లరేగళ్లలో రబీ సాగుకు సమాయత్తమవుతున్నారు. కరువు తాండవిస్తున్న వేళ 75 శాతం రాయితీ వర్తింపజేయాలని విపక్షాలు, రైతులు కోరుతున్నారు. అయితే 50 శాతం రాయితీ వర్తింపజేస్తారని గత కొంతకాలంగా అధికారులు చెబుతూ వచ్చారు. కానీ... చివరకు రాయితీని 35 శాతం ఖరారు చేశారు. అడిగినంత మేర 32,900 క్వింటాళ్ల విత్తన కేటాయింపులు చేశాం కానీ... రాయితీ మాత్రం పెంచేది లేదని స్పష్టం చేశారు. క్వింటా పూర్తి ధర రూ.9 వేలు ఖరారు చేసిన సర్కారు రాయితీని 35 శాతానికే పరిమితం చేయడంపై రైతులు పెదవి విరుస్తున్నారు. అదే ధరకు బహిరంగ మార్కెట్‌లో విత్తనాలు లభిస్తాయని చెబుతున్నారు.
విత్తన పంపిణీ ఆలస్యమే!
వేరుశనగ, పప్పుశనగ సరఫరా చేసిన ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులకు ఏపీ సీడ్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్ల ఖరీఫ్, రబీకి సంబంధించిన చెల్లింపులు పూర్తిగా చేయలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో రూ.70 కోట్లకు పైగా బకాయిలు ఉన్నందున.. ఇప్పుడు విత్తన సేకరణ, సరఫరాకు ప్లాంట్ల నిర్వాహకులు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. దీంతో విత్తన సేకరణ, పంపిణీ ఆలస్యమయ్యే పరిస్థితులు ఉన్నట్లు చెబుతున్నారు.
జగన్ హయాంలో 40 శాతం రాయితీ..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాం (2019 నుంచి 2024)లో ఏటా రబీలో విత్తన పప్పుశనగపై రైతులకు 40 శాతం రాయితీ వర్తింపజేశారు. ఏటా 30 వేల నుంచి 40 వేల క్వింటాళ్ల విత్తనం కేటాయించి అక్టోబర్ 15లోపు పంపిణీ చేయడంతో సకాలంలో పంట సాగు చేశారు. ఇప్పుడు రాయితీని కాస్త 35 శాతానికి కుదించేయడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మిల్లర్లకు బకాయిలు చెల్లించని సర్కార్
విత్తన సేకరణ.. సరఫరాకు ససేమిరా
అంటున్న వైనం


