ఆత్మకూరు: విద్యార్థినుల భద్రత విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు చల్లా మధుసూదన్‌రావు హెచ్చరించారు. ఆత్మకూరు కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని భవనంపైనుంచి కిందపడి గాయపడిన విషయం మీడియా ద్వారా తెలుసుకున్న ఆయన శనివారం జీసీడీఓ కవిత, ఓఎస్‌సీ మేనేజర్ శాంతామణితో కలిసి విద్యాలయాన్ని సందర్శించారు. సంఘటన ఎలా జరిగిందని ఉపాధ్యాయులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడి పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని ఆరా తీశారు. ఆ తర్వాత ఎస్‌ఓ లీమా రోజ్‌ను విచారణ చేశారు. విద్యార్థిని గాయపడినట్లు సమాచారం ఎందుకు ఇవ్వలేదని మండిపడినట్లు తెలిసింది. ఘనటపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని డీసీపీఓను ఆదేశించారు. గాయపడ్డ విద్యార్థినికి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు.
కేజీబీవీ పోస్టులకు
రేపు కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి ఈ నెల 28న కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ టి.శైలజ తెలిపారు. ఈ మేరకు ఆమె శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తాత్కాలిక తుది మెరిట్ జాబితాపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది మెరిట్ జాబితాను సమగ్ర శిక్ష వెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు రోస్టర్ నిబంధనల ప్రకారం సోమవారం కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు అవసరమైన ఇతర పత్రాలతో హాజరు కావాలని సూచించారు.
గైర్హాజరైన ఎస్జీటీపై వేటు
అనంతపురం ఎడ్యుకేషన్: అనుమతి లేకుండా ఏడాదికి పైగా విధులకు డుమ్మా కొట్టిన ఉపాధ్యాయుడిపై వేటు పడింది. పుట్లూరు మండలం దోసలేడు ఎంపీపీఎస్‌లో ఎస్జీటీగా పనిచేస్తున్న పి.రాజా రమేష్‌ను సర్వీసు నుంచి తొలగిస్తూ డీఈఓ ఎన్.అయూబ్ హుస్సేన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024 అక్టోబరు 25 నుంచి రాజా రమేష్ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరవుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై నోటీసులు జారీ చేసినా ఆయన నుంచి వివరణ అందలేదు. ఆచూకీ తెలియకపోవడంతో పుట్లూరు ఎంఈఓ ద్వారా వ్యక్తిగతంగా నోటీసులు అందించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 17న దినపత్రికల్లో బహిరంగ ప్రకటనలు ఇచ్చి పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరినా స్పందించలేదు. అనంతరం నిర్వహించిన శాఖాపరమైన విచారణలో ఆయనపై మోపిన అభియోగాలు రుజువైనట్లు అధికారులు నివేదిక సమర్పించారు. ఏడాదికి మించి అనధికారికంగా విధులకు గైర్హాజరైనందుకు నిబంధనల మేరకు ‘సేవ నుంచి తొలగింపు’ అనే ప్రధాన శిక్ష విధించినట్లు డీఈఓ తెలిపారు. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
కొత్త పింఛన్లు లేనట్లే
అనంతపురం టౌన్: ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లు అక్టోబర్‌లో లేనట్లేనని స్పష్టం అవుతోంది. కొత్త పింఛన్ల మంజూరు కోసం ఆశగా ఎదురు చూస్తున్న అర్హులకు ప్రభుత్వం మొండిచేయి చూపింది. పింఛన్ల కోసం జిల్లా వ్యాప్తంగా 67వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే పాత పింఛన్లకే నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. జిల్లాలో 2,75,708 మంది పింఛన్‌దారులకు రూ.123.81కోట్లు మంజూరయ్యాయి. ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కారణంగా అక్టోబర్ 1వ తేదీ ఉదయం సచివాలయ ఉద్యోగులు డబ్బులను డ్రా చేసి.. మధ్యాహ్నం నుంచి పంపిణీ చేయనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ శైలజ తెలిపారు.


