ఈ–స్టాంపుల కుంభకోణంపై సీ‘ఐ’డీ | - | Sakshi
Sakshi News home page

ఈ–స్టాంపుల కుంభకోణంపై సీ‘ఐ’డీ

Sep 27 2026 1:40 AM | Updated on Sep 27 2026 1:40 AM

● హైకోర్టు ఆదేశాలతో కదిలిన నేర పరిశోధన విభాగం

● కళ్యాణదుర్గంలో గోప్యంగా విచారణ

● అధికార పార్టీ అక్రమార్కుల్లో వణుకు

కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ (ఎస్‌ఆర్‌సీ) సంస్థ కేంద్రంగా సాగిన నకిలీ ఈ–స్టాంపుల కుంభకోణంపై నేర పరిశోధన విభాగం (సీఐడీ) దృష్టి సారించింది. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం చేకూర్చిన ఈ ఆర్థిక నేరంపై సమగ్ర దర్యాప్తు చేయించాలని, అసలు దోషులను వెలికి తీయాలని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై స్పందించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సమగ్ర దర్యాప్తునకు ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిష్పాక్షికంగా విచారణ చేపట్టి తక్షణమే పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని సూచించింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు. విజయవాడ నుంచి సీఐడీ అధికారుల బృందం రెండు రోజుల క్రితం కళ్యాణదుర్గం వచ్చింది. అత్యంత గోప్యంగా విచారణ చేపట్టడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అక్రమార్కులకు ముచ్చెమటలు!

నకిలీ ఈ–స్టాంపుల కుంభకోణంపై హైకోర్టు సీరియస్‌గా స్పందించడం, సీఐడీ అధికారులు విచారణకు రావడంతో అధికార పార్టీకి చెందిన అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కుంభకోణంలో అధికార పార్టీ నియోజకవర్గ ముఖ్య నేత పాత్ర కీలకంగా ఉందని సీఐడీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. హైకోర్టు ఆదేశాలతో సీఐడీ అధికారులు చేసిన తనిఖీలు, పరిశీలించిన డాక్యుమెంట్ల ఆధారంగా విచారణ వేగవంతం కానుండటంతో టీడీపీ శ్రేణుల్లో గుబులు మొదలైంది. ఈ కేసు ఇంకా ఎవరెవరి మెడకు చుట్టుకుంటుందోనని ఆందోళన చెందుతున్నారు.

ముంచుకొస్తున్న అరెస్టుల గండం!

సీఐడీ బృందంలో ఓ డీఎస్పీ స్థాయి అధికారితో పాటు ఇద్దరు ఎస్‌ఐలు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు కళ్యాణదుర్గంలో రహస్య విచారణ చేపట్టారు. విచారణ ప్రక్రియ కీలక దశకు చేరుకుంటే అక్రమాల్లో కీలకపాత్ర పోషించిన టీడీపీ పెద్ద తలకాయలు కూడా కటకటాల పాలవ్వడం ఖాయమన్న చర్చ స్థానికంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో అధికార పార్టీ రాజకీయ సమీకరణలూ మారే అవకాశాలు లేకపోలేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement