అనంతపురం అర్బన్: ‘రైతు కష్టాలపై ప్రభుత్వాలు స్పందించాలి. కాదని నిర్లక్ష్యం చేస్తే జెన్‌జీ తరహా ఉద్యమాలు తప్పవు. అదే జరిగితే ప్రభుత్వాలు తట్టుకోలేవు.’ అని మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ అన్నారు. శుక్రవారం స్థానిక క్లాక్‌టవర్ వద్ద సీపీఎం చేపట్టిన ‘రైతు రక్షణ జీపుయాత్ర’ కార్యక్రమానికి గేయానంద్‌తో పాటు సామాజికవేత్త బోస్, జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప హాజరై మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. ప్రభుత్వాలకు కంపెనీల మీద ఉన్న శ్రద్ధ రైతులపై చూపడం లేదని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి జిల్లాకు రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చి అమలు చేయాలన్నారు. పంట నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని, లేకపోతే ఆత్మహత్యలు పెరిగే అకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 28న కలెక్టరేట్ వద్ద ధర్నాకు పెద్ద సంఖ్యలో రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు హాజరై జయప్రదం చేయాలన్నారు.
రాప్తాడు రూరల్: కరువు పరిస్థితులపై రాప్తాడులో శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో జీపు జాతా చేపట్టారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు బాషా, సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: వర్షాభావంతో రైతులు కరువు కాటకాలతో రైతులు అల్లాడుతుంటే వారి గురించి పట్టించుకోని చంద్రబాబు కార్పొరేట్ కంపెనీలకు భూములు ధారాదత్తం చేస్తూ రైతుల ద్రోహిగా మారారని సీపీఎం సీనియర్ నాయకులు ఓబులు విమర్శించారు. ‘కరువు జీపుయాత్ర’లో భాగంగా శుక్రవారం ఆత్మకూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు హంద్రీ–నీవా నీళ్లను కుప్పానికి తీసుకెళ్తున్నా జిల్లాలోని టీడీపీ ప్రజాప్రతినిధులు ఏమీ మాట్లాడలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు.


