ఉరవకొండ: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై దాడి అమానుషమని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం ఓ ప్రకటనలో సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ న్యాయపరమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తే అక్రమ అరెస్టులు, లాఠీచార్జీలతో వేధించడం సరికాదన్నారు. సచివాలయ ఉద్యోగులను అక్రమంగా అరెస్టు చేసిన వారిని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. మహిళలలు అని చూడకుండా రోడ్డుపై ఈడ్చుకెళ్లడం సరికాదన్నారు. 15,004 సచివాలయాను 7,715 కు కుదించే నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. సర్వేలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాల పేరుతో ఉద్యోగులపై అధిక పనిభారం పెడుతున్నారని విమర్శించారు. ఉద్యోగులకు శాఖల వారీగా ప్రమోషన్లు కల్పించకుండా సూపర్ న్యూమరీ పోస్టుల పేరుతో ఉత్తర్వులు జారీ చేయడం సరికాదన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బేషరుతుగా పదోన్నతులు కల్పించి, నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.


