అనంతపురం సెంట్రల్: పోలీసుశాఖలో స్పెషల్ బ్రాంచ్ విభాగం సీఐలు ధరణీకిషోర్, క్రాంతికుమార్ బదిలీపై జోరుగా చర్చ సాగుతోంది. నగరంలో రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో బదిలీకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ఇటీవల మంత్రి నారా లోకేష్ జిల్లాకు వచ్చినప్పుడు ఫిర్యాదు చేశారని, అందులో భాగంగా బదిలీ జరుగుతోందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకూ అధికారికంగా బదిలీ ఉత్తర్వులు వెలువడలేదు.
బీమా ప్రీమియం జమ
చేయలేదని నిరసన
కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని చాపిరి గ్రామ రైతులు పంటల బీమా ప్రీమియం చెల్లించినా ఇన్సూరెన్స్ కంపెనీకి నగదు జమ చేయలేదని స్థానిక యూనియన్ బ్యాంకు ఎదుట సోమవారం ఆందోళన చేశారు. అనంతరం పీజీఆర్‌ఎస్‌లో ఆర్డీఓ వసంత్‌బాబుకు ఫిర్యాదు చేశారు. రైతులు మాట్లాడుతూ వర్షాభావంతో సాగు చేసిన పంటలు పండక నష్టపోయామన్నారు. యూనియన్ బ్యాంకులో 100 మంది రైతుల నుంచి వసూలు చేసిన రూ.10 లక్షలపైగా నగదు ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లించకుండా నిర్లక్ష్యం చేశారని వాపోయారు. న్యాయం చేసేంత వరకూ ఇక్కడి నుంచి కదిలేదిలేదని బ్యాంకు ఎదుట నిరసన తెలిపారు. అనంతరం రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా యూనియన్ బ్యాంకర్లు మాట్లాడుతూ సాంకేతిక సమస్యతోనే ఇలా జరిగిందని చెప్తున్నారు.
భార్యను హత్య చేసిన
భర్త అరెస్ట్
రాప్తాడు రూరల్: భార్యను హత్య చేసిన కేసులో నిందితుడైన భర్తను అనంతపురం రూరల్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ శ్రీకాంత్‌యాదవ్ తెలిపిన మేరకు.. ఈనెల 25న అనంతపురం రూరల్ మండలం నేషనల్ పార్క్ సమీపంలోని తడకలేరు వంక వద్ద ఎస్.అఖిలను ఆమె భర్త జోటి రాజేష్ హత్య చేశాడు. అఖిలకు మరొకరితో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో ఈ హత్య చేసినట్లు సీఐ తెలిపారు. ఈ ఘటనపై అఖిల తండ్రి సారాయి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేశారు. నిందితుడు జోటి రాజేష్‌ను సోములదొడ్డి సమీపంలోని ఇస్కాన్ టెంపుల్ వద్ద అరెస్టు చేశారు. హత్యకు వాడిన కత్తితో పాటు ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.


