‘మోడల్‌ సోలార్‌’కు ఐదు గ్రామాల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

‘మోడల్‌ సోలార్‌’కు ఐదు గ్రామాల ఎంపిక

Sep 29 2026 12:21 AM | Updated on Sep 29 2026 12:21 AM

అనంతపురం అర్బన్‌: పీఎం సూర్యఘర్‌ పథకం కింద మోడల్‌ సోలార్‌ విలేజ్‌ పోటీలకు జిల్లాలో ఐదు గ్రామాలను ఎంపిక చేశామని కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. కలెక్టర్‌ సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో మోడల్‌ సోలార్‌ విలేజ్‌ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. సూర్యఘర్‌ పథకం ద్వారా జిల్లాలో 5 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలను మోడల్‌ సోలార్‌ విలేజ్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. మోడల్‌ విలేజ్‌ పోటీలకు నార్పల, యాడికి, కంబదూరు, రాప్తాడు, ఉరవకొండ గ్రామాలను ఎంపిక చేశామన్నారు. ఏ గ్రామంలో అత్యధికంగా సోలార్‌ రూఫ్‌టాప్‌ ఇన్‌స్టలేషన్‌ ఏర్పాటు చేసుకుంటారో ఆ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం రూ.కోటి ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తుందన్నారు.

పటిష్ట చర్యలు చేపట్టాలి : ఘనవ్యర్థాల నిర్వహణకు పటిష్ట చర్యల చేపట్టాలని కలెక్టర్‌ ఆనంద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో ఘన వ్యర్థాల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.

మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలి : గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతంగా చేసి డిసెంబర్‌లోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టర్‌ సోమవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో జిల్లా వాటర్‌, శానిటరీ మిషన్‌ సమావేశం నిర్వహించారు.

అత్తింటి ఆరళ్లు తాళలేక గర్భిణి ఆత్మహత్య

కణేకల్లు: నిండుచూలాలు... ఒకసారి పుట్టింటికెళ్లి అమ్మనాన్నను మాట్లాడొద్దామనుకొంది. అందుకు అత్త ఒప్పుకోకపోగా... సూటిపోటి మాటలతో బాధపెట్టింది.. మనస్థాపం చెందిన నాలుగు నెలల గర్భిణి అక్షయ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన కణేకల్లు మండలంలోని నల్లపంల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకొంది. పోలీసుల కథనం మేరకు వివరాలు.. అనంతపురానికి చెందిన కృష్ణ కూతురు అక్షయకు కణేకల్లు మండలంలోని నల్లంపల్లిలోని అక్క నాగేవేణి కొడుకు మహేష్‌కిచ్చి ఎనిమిది నెలల క్రితం వివాహం చేశాడు.పెళ్లయినప్పటి నుంచి అత్త, కోడలి మధ్య నిత్యం ఏదో విషయంలో గొడవ జరుగుతూ ఉండేది. ఈ విషయాన్ని అక్షయ తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పి బాధపడేది. అక్షయ గర్భం దాల్చింది. ప్రస్తుతం నాలుగు నెలల గర్భిణి. 15 రోజుల క్రితం అక్షయ తల్లిదండ్రులు నల్లంపల్లి గ్రామానికొచ్చి తమ కూతుర్ని మా ఇంటికి తీసుకెళ్తాం.. కొన్నాళ్లూ ఉండి వస్తుందని అడిగితే నాగవేణి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఆదివారం అక్షయ ఒక్కసారి పుట్టింటికి పంపండి... రెండ్రోజుల ఉండి వస్తానని అడిగింది. అందుకు అత్త ససేమిరా అనింది. ఇప్పుడు వెళ్లొద్దని..ఐదు నెలలు పూర్తయ్యాక వెళ్లు.. పంపిస్తానంటూ కస్సుబుస్సు మనింది. ఇప్పుడే వెళ్తానంటే వెళ్లు..మళ్లీ రావద్దని గట్టిగా చెప్పింది. బేల్దారి పని చేస్తున్న కొడుకు మహేష్‌ రెండ్రోజుల నుంచి పనికి వెళ్లకుండా ఇంట్లో ఉండటంతో ఇంటిపట్టున ఉంటే కుటుంబం గడిచేదెలా? అంటూ కొడుకును కూడా నాగవేణి మందలించింది. దీంతో మహేష్‌ విసుగు చెంది ఆదివారం రాత్రి ఆలస్యంగా ఇంటికొచ్చాడు. అప్పటికే ఆమె ఇంట్లోని బెడ్‌ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని విగతజీవిగా కనిపించింది. అక్షయ గర్భిణి కావడంతో మృతదేహానికి అనంతపురం సర్వజనాస్పత్రిలో పోస్టుమార్టం చేయించారు. బాధిత తండ్రి కృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు..అత్త నాగవేణి, అల్లుడు మహేష్‌, ఆడబిడ్డ కవిత, ఆమె భర్త రాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగమధు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement