అనంతపురం ఎడ్యుకేషన్: ఆ విద్యార్థిని కష్టపడి చదివింది.. ఏపీఆర్‌ఎస్‌లో 5వ తరగతి సీటు కోసం రాతపరీక్ష రాసింది.. మంచి మార్కులతో ప్రతి భ చాటింది... చదివిన పాఠశాల ఇచ్చిన నాలుగో తరగతి ధ్రువపత్రాలతో ఏపీఆర్‌ఎస్‌లో ఐదో తరగతిలో అడ్మిషన్ పొందింది. ప్రస్తుతం అదే తరగతిలో చదువుతోంది. కానీ ఆన్‌లైన్ రికార్డుల్లో మాత్రం ఆ విద్యార్థిని 6వ తరగతి చదువుతున్నట్లు నమోదై ఉంది. దీంతో ఆమె భవిత ప్రశ్నార్థకంగా మారింది. వివరాలు.. కంబదూరుకు చెందిన జి.ప్రభాకర్, జి. సంతోషమ్మ దంపతుల కుమార్తె పి.గ్లోరి. ఆమె ప్రస్తుతం గుత్తి ఏపీఆర్‌ఎస్‌లో ఐదో తరగతి చదువుతోంది. నాల్గో తరగతి చదువుతున్న సమయంలో ఏపీఆర్‌ఎస్‌లో 5వ తరగతి ప్రవేశం కోసం రాతపరీక్షకు హాజరైంది. మంచి మార్కులు సాధించి సీటు పొందింది. అప్పటి పాఠశాల యాజమాన్యం మంజూరు చేసిన నాలుగో తరగతి ధ్రువపత్రాలను ఏపీఆర్‌ఎస్‌లో సమర్పించి తల్లిదండ్రులు అడ్మిషన్ తీసుకున్నారు. అప్పటి నుంచి గ్లోరి ఐదో తరగతి చదువుతోంది. రెండు రోజుల క్రితం ఏపీఆర్‌ఎస్ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ రావడంతో అసలు సమస్య వెలుగుచూసింది. గ్లోరి ఆన్‌లైన్ రికార్డుల్లో 6వ తరగతి చదువుతున్నట్లు నమోదై ఉందని ఆన్‌లైన్ వివరాలను సరిచేయకుండా విద్యార్థినిని కొనసాగించడం సాధ్యం కాదని, లేదంటే పాపను వెనక్కి తీసుకెళ్లాలని చెప్పడంతో తండ్రి ఆందోళనకు గురయ్యాడు.
ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి ..
బాధిత విద్యార్థిని తండ్రి ప్రభాకర్ రామగిరి మండలం పేరూరులోని అక్షయ ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు వెళ్లాడు. అక్కడ గ్లోరి మూడు, నాలుగో తరగతులు చదివింది. తమ పాఠశాల వద్ద ఎలాంటి పొరపాటు జరగలేదని చెప్పారు. అక్కడి నుంచి రామగిరి ఎంఈఓ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. అక్కడా ఇదే సమాధానం వచ్చింది. అక్కడి నుంచి అనంతపురం డీఈఓ కార్యాలయానికి వచ్చినా తమ పరిధిలోకి రాదని, శ్రీసత్యసాయి జిల్లా డీఈఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. సంబంధిత పాఠశాలలు, విద్యాశాఖ రికార్డులను పరిశీలించి అసలు తప్పిదం ఎక్కడ జరిగిందో గుర్తించాలని బాధితుడు కోరుతున్నాడు. జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ఆన్‌లైన్ వివరాలను సరిచేసి తమ కుమార్తె ఏపీఆర్‌ఎస్‌లో 5వ తరగతి చదువును కొనసాగించేలా న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.
ఎవరో చేసిన తప్పిదానికి పేద విద్యార్థిని భవిత ప్రశ్నార్థకం


