నేటి నుంచి మూడోవిడత పల్లె పండుగ | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి మూడోవిడత పల్లె పండుగ

Sep 29 2026 12:21 AM | Updated on Sep 29 2026 12:21 AM

అనంతపురం న్యూ టౌన్‌: జిల్లాలో మంగళవారం నుంచి వారం రోజులపాటు మూడో విడత పల్లె పండుగ నిర్వహిస్తున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్‌ సలీం బాషా తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం వివరాలు వెల్లడించారు. జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామ పంచాయతీల్లో వచ్చేనెల 5 వరకు నిర్వహించనున్న పల్లె పండుగ 3.0 ద్వారా సుమారు రూ.130 కోట్ల మేర అభివృద్ధి పనులను ప్రారంభానికి అంకురార్పణ జరుగుతుందన్నారు. ఇందులో రూ.101.64 కోట్లతో 203 కిలో మీటర్ల మేర సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, మట్టి రోడ్లలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. సుమారు రూ.27.5 కోట్ల వ్యయంతో జిల్లాలో 1,377 మినీ గోకులాలు నిర్మించనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 62 కిలోమీటర్ల మ్యాజిక్‌ డ్రైయిన్ల అభివృద్ధి, 3 వేల హెక్టార్లలో ఉద్యానతోటల అభివృద్ధి, ఇతర మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు.

1న ఉదయమే

పింఛన్లు పంపిణీ

అనంతపురం టౌన్‌: ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ అక్టోబర్‌ 1న ఉదయం 7 గంటల నుంచే ప్రారంభించనున్నట్లు డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ శైలజ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె లేకపోవడంతో యధావిధిగానే పింఛన్ల పంపిణీ ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అక్టోబర్‌ నెలలో 2,75,708 అన్ని రకాల పింఛన్లకు రూ.123.81 కోట్లు మంజూరైనట్లు ఆమె తెలిపారు.

జాతీయ స్థాయి జంప్‌రోప్‌ పోటీలకు ఎంపిక

తాడిపత్రి రూరల్‌ : జాతీయ స్థాయి జంప్‌రోప్‌ పోటీలకు తాడిపత్రికి చెందిన ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. ఏలూరులో నిర్వహించిన ఎనిమిదో రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌, ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ జంప్‌రోప్‌ చాంపియన్‌ షిప్‌లో అక్షయ, శ్రీరాజ్‌, తనన్య, నిహారిక, జగదీష్‌ అత్యుత్తమ ప్రతిభ కనపరిచారు. జాతీయ స్థాయి జంప్‌రోప్‌ పోటీలకు ఎంపికై న విద్యార్థులకు జిల్లా అసోసియేషన్‌ కార్యదర్శి నరసింహనాయక్‌ అభినందించారు.

పెట్రోల్‌ కోసం వెళ్తూ పరలోకాలకు ...

రాప్తాడు రూరల్‌: పెట్రోలు కోసం వెళ్లిన ఓ వృద్ధ రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని హంపాపురం సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. హంపాపురానికి చెందిన ఆండ్ర సుబ్బరాయుడు (61) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. సోమవారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై పెట్రోల్‌ కోసం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు వెళ్లే రహదారి పక్కన ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంకుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో సుబ్బరాయుడు బైక్‌తో సహా రోడ్డుపై పడిపోగా, తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు సంతానం. ఇద్దరు కూతుళ్లకు వివాహాలయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రాప్తాడు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

గడువులోపు వినతులు పరిష్కరించాలి

అనంతపురం సెంట్రల్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన వినతులను గడువులోపు పరిష్కరించాలని ఎస్పీ జగదీష్‌ ఆదేశించారు. సోమవారం పోలీసు కాన్ఫరెన్స్‌హాలులో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 98 వినతులు అందాయి. బాధితులకు వేగంగా, పారదర్శకంగా న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగభూషణం, మహిళా విభాగం డీఎస్పీ శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement