అనంతపురం: నగరంలోని ఆర్డీటీ క్రీడాగ్రామం వేదికగా సాగిన డాక్టర్ తాలిమెరెన్ ఆవో అండర్–19 బాలికల నేషనల్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను పశ్చిమ బెంగాల్ జట్టు కై వసం చేసుకుంది. క్రీడాకారులు పట్టుదలతో శ్రమించి డిఫెండింగ్ చాంపియన్ మణిపూర్ జట్టును ఓడించి తమ చిరకాల కలను సాకారం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం పశ్చిమ బెంగాల్, మణిపూర్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి రెండు జట్లూ చెరో గోల్ సాధించి సమంగా నిలిచాయి. ఆ తర్వాత జరిగిన పెనాల్టీ షూటౌట్‌లో పశ్చిమ బెంగాల్ జట్టు క్రీడాకారులు ఒత్తిడిని జయించి 3 గోల్స్ చేయగా, మణిపూర్ జట్టు 2 గోల్స్‌కే పరిమితమైంది. విజేతలను అభినందిస్తూ ఏపీఎఫ్‌ఏ జనరల్ సెక్రటరీ డేనియల్ ప్రదీప్, ఎగ్జిక్యూటివ్ అర్పిత, నవీన్, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు దాదా ఖలందర్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ శ్రీసత్యసాయి జిల్లా ఉపాధ్యక్షుడు ఈఆర్ షాద్, కడప జనరల్ సెక్రటరీ సుధీర్ తదితరులు మెడల్స్, ట్రోఫీలను అందజేశారు.


