గుంతకల్లు: సరుకు రవాణా సామర్థ్యం పెంపునకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవాలని దక్షిణ తీర రైల్వే ప్రిన్సిపాల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ (పీసీఓఎం) వినీత్‌కుమార్, డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని జూటురు రైల్వేస్టేషన్‌కు అనుసంధానంగా ఉన్న ఎంఎస్ అల్ట్రాటెక్ సిమెంట్ సైడింగ్(యూసీఎల్‌జే) పాయింట్‌ను సోమవారం పీసీఓఎం, డీఆర్‌ఎంలు సందర్శించారు. ఈ సందర్భంగా యూసీఎల్‌జే ప్రతినిధులతో సిమెంట్ లోడింగ్ పెంపుపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు సూచనలు, సలహాలు తెలియజేశారు. సరుకు రవాణాలో నిరంతర వృద్ధి సాధించేందుకు కొత్త మార్కెట్ గమ్యస్థానాలపై దృష్టి సారించాలన్నారు. అనంతరం పీసీఓఎం, డీఆర్‌ఎంలు మాట్లాడుతూ ఏడాది ఇప్పటి వరకు యూసీఎల్‌జే ద్వారా దాదాపు 2,521 మిలియన్ టన్నుల సరుకును లోడ్ చేసినట్లు తెలిపారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 13 శాతం వృద్ధి పెరిగినట్లు చెప్పారు. డివిజన్ మొత్తం ఆరిజినేటింగ్ ప్రైట్ లోడింగ్‌లో యూసీఎల్‌జే సైడింగ్ వాటా దాదాపు 54 శాతం ఉండటం విశేషమన్నారు. ఇక సైడింగ్ ప్లాంట్ విస్తరణ పూర్తయితే ప్రసుత్తం రోజుకు 6.5 రేక్‌ల నుంచి 13 రేక్‌ల వరకు లోడింగ్ సామర్థ్యం పెరుగుతుందని, దీంతో గుంతకల్లు డివిజన్ సరుకు రవాణా వృద్ధిలో యూసీఎల్‌జే పాత్ర మరింత బలోపేతం అవుతుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ డీఓఎం దినేష్‌కుమార్, సీనియర్ డీఈఈ సుదర్శన్‌రెడ్డి, సీనియర్ డీసీఎం కే.సత్యనారాయణ, డీఈఎన్ రమసామీ తదితరులు పాల్గొన్నారు.
ఫ్యాక్టరీల ప్రతినిధులతో సమావేశం
తాడిపత్రి రూరల్: మండలంలోని బుగ్గ వద్ద గల అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో అల్ట్రాటెక్, అదానీ సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతినిధులతో సోమవారం సౌత్ కోస్ట్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ వినీత్‌కుమార్ సమావేశమయ్యారు. సిమెంట్ లోడింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక సాంకేతికతను అందజేస్తామన్నారు. గుంతకల్లు నుంచి సరుకు రవాణాలో ఏఐ ఆధారిత సాంకేతికను ఉపయోగించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట తాడిపత్రి రైల్వే స్టేషన్ మేనేజరు అనిల్, కమర్షియల్ అఫీసర్ అనుకుమార్ తదితరులు ఉన్నారు.


