అనంతపురం కల్చరల్: నిరుద్యోగులకు అవసరమైన ప్రామాణిక పుస్తకాలను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని శనివారం కలెక్టర్ తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠకులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూసుకోవాలని, ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకుని నిరుద్యోగులలో ఆత్మవిశ్వాసం నింపాలన్నారు. కార్యదర్శి శివప్రసాద్‌తో పాటు డిప్యూటీ లైబ్రేరియన్ కమ్మన్న, ఉద్యోగ సంఘం నాయకులు రవికుమార్, ప్రతాప్‌రెడ్డి, జయరామ్, శ్రీనివాసులు తదితరులు కలెక్టర్‌కు ఇతర శాఖా గ్రంథాలయాల వివరాలందించారు.
గడ్డి మందు తాగి
యువతి ఆత్మహత్య
బుక్కరాయసముద్రం: గడ్డి మందు తాగి యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని కొత్తపల్లిలో జరిగింది. పొలీసులు తెలిపిన మేరకు.. కొత్తపల్లికి చెందిన రాజు, జానకి దంపతుల కుమార్తె అశ్వని (19) తన తల్లితో కలిసి నిత్యం కూలి పనులకు వెళ్తుండేది. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న గడ్డి మందు తీసుకుని గ్రామం బయటకు వెళ్లిన ఆమె.. అక్కడ గడ్డి మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది. స్థానికులు గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి పరిశీలించగా, అప్పటికే అశ్వని మృతి చెందింది. అశ్వని ఆత్మహత్యకు దారి తీసిన కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మాతాశిశు ఆరోగ్య రక్షణే ధ్యేయం
అనంతపురం సిటీ: మాతాశిశు ఆరోగ్య రక్షణే ధ్యేయంగా పని చేయాలని ఐసీడీఎస్ సిబ్బందికి కలెక్టర్ ఓ. ఆనంద్ పిలుపునిచ్చారు. అనంతపురంలోని బరమప్ప వీధిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని శనివారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోషకాహార, సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఆరా తీశారు. బాలింతలు, స్థానిక లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. తల్లులు, పిల్లల హిమోగ్లోబిన్ స్థాయిలను తనిఖీ చేయడం, పిల్లల బరువులను ట్రాక్ చేయడం, అంగన్‌వాడీ కేంద్రం సమగ్ర పనితీరును పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆహారంలో తగినంత ప్రొటీన్ ఉండేలా చూసుకోవాలన్నారు. తాజా, స్థానికంగా తయారు చేసిన వేడి భోజనాన్ని తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ సాజిదా బేగం, అనంతపురం అర్బన్ సీడీపీఓ లలితమ్మ, సూపర్‌వైజర్ హేమలత, అంగన్‌వాడీ సిబ్బంది, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.


