నిర్లక్ష్యం.. నిర్వీర్యం | - | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యం.. నిర్వీర్యం

Sep 13 2026 7:52 AM | Updated on Sep 13 2026 7:52 AM

మహోన్నత లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సమగ్ర శిశు అభివృద్ధి సేవలు (ఇంటిగ్రేటెడ్‌ ఛైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌– ఐసీడీఎస్‌) ఆచరణలో నిర్వీర్యమవుతున్నాయి. అంతులేని అవినీతి, అక్రమాలు చోటు చేసుకోవడంతో ఈ కార్యక్రమ లక్ష్యం కాస్త నీరుగారి పోతోంది. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి.

అనంతపురం సిటీ: చిన్నారులు, గర్భిణులు, పాలిచ్చే తల్లులోని పోషకాహార లోపం, ఆరోగ్య పరిరక్షణ, అభివృద్ధి అవసరాలను పరిష్కరించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐసీడీఎస్‌ పథకం అమలులో ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. పిల్లలకు అనుబంధ పోషణ, రోగనిరోధక టీకాలు, ప్రీ–స్కూల్‌ విద్య అందించడం లక్ష్యంగా 1975లో ఈ పథకం ప్రారంభమైంది. అనంతరం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా తల్లీపిల్లల సంపూర్ణ అభివృద్ధి కోసం సమగ్ర సేవల ప్యాకేజీని అందించే ప్రపంచంలోని అతిపెద్ద ప్రాయోజిత కార్యక్రమాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.

అంతులేని అలసత్వం..

పేదరికం, అవగాహన లేమి కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది మహిళలు పోషకాహార లోపంతో బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి వారిలో ప్రసవ సమయం హైరిస్క్‌గా మారి తల్లీబిడ్డల ప్రాణానికే ముప్పు వాటిల్లుతోంది. గర్భం దాల్చిన పేద మహిళలకు పోషకాహారం అందించాల్సిన ప్రభుత్వం.. కేవలం ప్రకటనలకే పరిమితమవుతోంది. గత ప్రభుత్వంలో అందించిన సంపూర్ణ పోషకాహారం కిట్‌లను సైతం పంపిణీ చేయడంలో ప్రభుత్వం అంతులేని అలసత్వం వహిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రాణాలు పోతున్నా పట్టదా..?

అనంతపురంలోని సర్వజనాస్పత్రికి ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో గర్భిణులు కాన్పు కోసం వస్తుంటారు. ఇక్కడ ప్రతి నెలా వందల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. అయితే ప్రసవం కోసం జీజీహెచ్‌కు వచ్చేవారిలో రక్తహీనతతో బాధపడుతున్న వారే ఎక్కువగా ఉండడం ఆందోళనకరం. రక్తంలో హిమోగ్లోబిన్‌ పది గ్రాముల శాతం కంటే తక్కువగా ఉంటే రక్తహీనతగా, ఏడు గ్రాములు, అంతకంటే తక్కువగా ఉంటే తీవ్రమైన రక్తహీనతగా పరిగణిస్తారు. జీజీహెచ్‌కు వచ్చే గ్రామీణ గర్భిణులు ప్రతి వంద మందిలో ఆరు గ్రాముల కంటే హిమోగ్లోబిన్‌ శాతం తక్కువగా ఉన్న వారు 15 మందికి పైగా ఉంటున్నట్లు సమాచారం. సాధారణంగా హిమోగ్లోబిన్‌ 9 గ్రాముల కంటే తక్కువగా ఉంటే ప్రసవం కష్టతరం (రిస్క్‌)గా ఉంటుందని వైద్యులు అంటున్నారు. ఇక ఆరు గ్రాముల కంటే తక్కువ ఉన్నవారిని హైరిస్క్‌గా పరిగణించి రెండు, మూడు యూనిట్ల రక్తం ఎక్కించాల్సి వస్తోందని అంటున్నారు. సమగ్రంగా వైద్య శాస్త్రం అభివృద్ధి చెందిన ప్రస్తుత రోజుల్లో కేవలం సరైన పోషకాహారం అందక రక్తహీనతతో బాధపడుతూ ప్రసవ సమయంలో ప్రాణాలు కోల్పోతున్నారంటే అధికారుల నిర్లక్ష్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

రక్తహీనత తీవ్ర రూపం

మహిళాశిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మధ్య సమన్వయ లోపం కారణంగా గర్భిణులకు పోషకాహారం సక్రమంగా అందడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఇటీవ అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా మ్యాపింగ్‌ సక్రమంగా సాగలేదు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుపేద గర్భిణులకు పోషకాహారం అందించడమనేది అందని ద్రాక్షగానే మారింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో గర్భిణులకు సంపూర్ణ పోషకాహార కిట్‌లను అందించేవారు. ఇందులో పాలు, కందిపప్పు, చిక్కీలు, నూనె, బియ్యం, కోడిగుడ్లు వంటివి ఉండేవి. ప్రస్తుతం రేషన్‌బియ్యం, పుచ్చిపోయిన కందిపప్పు, నాసిరకంగా ఉండే రాగిపిండి వంటివి సరఫరా చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. దీంతో గర్భిణుల్లో రక్తహీనత సమస్య మరింత తీవ్ర రూపం దాల్చి మాతాశిశు మరణాలకు దారి తీస్తోంది. ఇప్పటికై నా ఐసీడీఎస్‌ అధికారులు స్పందించి మాతాశిశు సంరక్షణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ఆశించిన ఫలితాలనివ్వని ఐసీడీఎస్‌

గర్భిణులకు అందని పోషకాహారం

పథకం అమలుపై

అధికారుల అలసత్వం

పెరుగుతున్న రక్తహీనత బాధితులు

కొనసాగుతున్న మాతాశిశు మరణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement