అర్హులకు పింఛన్‌ అందించకుంటే ఉద్యమమే | - | Sakshi
Sakshi News home page

అర్హులకు పింఛన్‌ అందించకుంటే ఉద్యమమే

Sep 13 2026 7:52 AM | Updated on Sep 13 2026 7:52 AM

అనంతపురం: ‘కరువు పీడిత అనంతపురం జిల్లాలో పింఛన్‌ డబ్బుతో కుటుంబాలను పోషించుకుంటున్న కుటుంబాలు వేలల్లో ఉన్నాయి. టీడీపీకి ఓటు వేయలేదని పింఛన్లకు ఎంపిక చేయకపోతే అర్హులతో కలిసి ఉద్యమం చేపడతాం’ అని వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. కళ్యాణదుర్గం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సచివాలయ సిబ్బంది, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులతో గంటల తరబడి సమీక్షా సమావేశాలు నిర్వహించి ఉద్యోగులను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్ల తర్వాత ప్రభుత్వం కొత్త పింఛన్లకు దరఖాస్తులను ఆహ్వాని స్తుంటే, ఆ ప్రక్రియను సచివాలయాల్లో కాకుండా కేవలం ‘ప్రజావేదిక’లోనే పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రభుత్వ యంత్రాంగాన్ని తన వ్యక్తిగత, పార్టీ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులను పింఛన్‌ అర్హత జాబితా నుంచి తొలగించే కుట్ర చేస్తున్నారనే అనుమానముందన్నారు. తమ పార్టీ వారినే కాకుండా సీపీఎం, సీపీఐ తదితర పార్టీల సానుభూతి పరులై పింఛన్‌కు అర్హత ఉన్న వారిని ఎంపిక చేయాల్సిందేనని డిమాండ్‌ చేశారు. పింఛన్‌ అనేది ప్రభుత్వ ఖజానా నుంచి, ప్రజల పన్నుల డబ్బుతో అమలు చేసే సంక్షేమ కార్యక్రమమని, సురేంద్రబాబు లేదా చంద్రబాబు సొంత నిధులు కావని మండిపడ్డారు. నారా వారి కానుక అని సొంత సొమ్ము ఇస్తే ఎక్కడైనా ఇచ్చుకోవచ్చని, తమకు అభ్యంతరం లేదని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా సమీక్షలు, పింఛన్ల దరఖాస్తుల స్వీకరణ వ్యవహారంపై కలెక్టర్‌ తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌ సీపీ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలతో సంబంధం లేకుండా పింఛన్లు అందాయని గుర్తు చేశారు. నేడు కేవలం టీడీపీ మద్దతుదారులకే ఇస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పింఛన్‌ బాధితుల తరఫున పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్‌, గోళ్ల సూరి, కృష్ణమూర్తి, దొడగట్ట మురళి, విజయ్‌ కుమార్‌, ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి సాకే రామాంజినేయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement