● సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్
అనంతపురం అర్బన్: ‘‘విద్యుత్ ట్రాన్స్‌మిషన్ ఏర్పాటు కోసం బొమ్మనహాళ్ మండలంలో దళిత రైతుపై దౌర్జన్యం చేసి పంటను ధ్వంసం చేయడం దుర్మార్గం. పోలీసులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. దారుణ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టాలి’’ అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ అన్నారు. శనివారం స్థానిక గణేనాయక్ భవన్‌లో జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్పతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. బొమ్మనహాళ్ మండలం శ్రీదరఘట్ట గ్రామంలో రిసోనియా అనే ప్రైవేటు కంపెనీకి కారుచౌకగా భూములను కట్టబెట్టారన్నారు. ఎల్‌బీనగర్‌కు చెందిన అమర్, రామసుబ్బమ్మ, లక్ష్మిదేవి, సుంకన్న తదితర పేద రైతుల భూములను బలవంతంగా లాక్కోవడం దారుణమన్నారు. పెద్దసంఖ్యలో పోలీసులతో వెళ్లి భయాందోళన సృష్టిస్తూ పచ్చని పంటలను నాశనం చేయడం సర్కారు నిరంకుశత్వానికి పరాకాష్ట అంటూ ధ్వజమెత్తారు. నంద్యాల జిల్లాలో అక్కడి కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ (ఆర్‌సి.బి5.1298/2024) ప్రకారం ట్రాన్స్‌మిషన్ లైన్ నిర్మాణ క్రమంలో నష్టపోతున్న రైతులకు సెంటుకు రూ.85 వేల చొప్పున పరిహారంతో పాటు జాతీయ రహదారి సమీప భూములకు అదనంగా 150 శాతం ధర, ఆర్‌ఓఆర్ పరిహారం 30 శాతం, పంటలు, బోరుబావులకు నష్ట పరిహారాన్ని నిర్ణయించారన్నారు. నంద్యాల తరహాలో ఈ జిల్లాలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. దళితుడైన సుంకన్నతో పాటు ఇతర రైతులపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. చేతికి వచ్చిన మొక్కజొన్న పంటను జేసీబీతో ధ్వంసం చేశారన్నారు. ఈ దారుణానికి పాల్పడిన అధికారులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద వెంటనే కేసు నమోదు చేయాలన్నారు. కలెక్టర్, ఎస్పీ స్పందించి విచారణ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శివర్గ సభ్యులు చంద్రశేఖర్‌రెడ్డి, రామాంజనేయులు పాల్గొన్నారు.


