8లో
న్యూస్‌రీల్
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమైంది. ఉక్కపోత పెరిగింది. వాయువ్య దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
చీనీ టన్ను రూ.15,500
అనంతపురం మార్కెట్ యార్డులో శనివారం చీనీకాయలు టన్ను గరిష్ట ధర రూ.15,500, కనిష్టం రూ.7 వేలు పలికాయి.
ఆదివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
సాక్షి, పుట్టపర్తి:
పరిటాల కుటుంబం దౌర్జన్యాలు, దుర్మార్గాలకు అంతేలేకుండా పోతోంది. నమ్మి ఓట్లేసిన జనాన్ని నట్టేట ముంచేందుకు సిద్ధమైంది. పరిటాల కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరుల దుర్మార్గాలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. తాజాగా సొంతమండలం రామగిరిలోని రైతుల పట్టా భూములపై పరిటాల కుటుంబం పెత్తనం చేస్తోంది. ‘‘ఎవడి భూమైతే మాకేంటి...మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం’’ అంటూ దౌర్జన్యంగా వ్యవహరిస్తోంది.
అంతా మేమే చేసుకుంటామని హామీ..
రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం దుబ్బార్లపల్లి, ముత్యాలంపల్లి, మక్కినవారిపల్లి, చిన్నకొండాపురం, పెద్ద కొండాపురం, నసనకోట, రెడ్డివారిపల్లి గ్రామాలతోపాటు కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో సోలార్, విండ్ పవర్ గ్రిడ్ టవర్లు నిర్మించేందుకు జేఎస్‌డబ్ల్యూ, అమరరాజ కంపెనీలు సిద్ధమయ్యాయి. ఇందుకోసం స్థానికంగా ఉన్న నాయకులను కలిసి టవర్ల నిర్మాణాలకు భూసేకరణ చేపట్టాలని ఆయా కంపెనీలు భావించాయి. ఈ క్రమంలో పరిటాల కుటుంబీకులను కలవగా...తాము అడిగినంత ఇస్తే అంతా తామే చూసుకుంటామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు సదరు కంపెనీలు అంగీకరించడంతో రామగిరి మండలంలో సోలార్ విద్యుత్ టవర్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.
పరిటాల తిప్పన్న ఆధ్వర్యంలో పనులు..
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సమీప బంధువు పరిటాల తిప్పన్న టవర్ల నిర్మాణ పనులు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. ఒక్కో టవర్ నిర్మాణానికి కాంట్రాక్టర్ రూ.కోటికిపైగా అంచనాలు వేయగా, ఈ ప్రాంతంలోనే వంద టవర్లకుపైగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఒక టవర్ కేబుల్‌వైర్‌తోపాటు నిర్మాణానికి మూడు ఎకరాల భూమి కావాల్సి ఉండగా, రామగిరి మండలంలో అధికారులు నామమాత్రంగా సర్వేలు చేసి కాంట్రాక్ట్ పనులు అప్పగించారని బాధిత రైతులు వాపోతున్నారు.
కర్ణాటక రైతులకు భారీగా పరిహారం..
రామగిరికి సమీపంలోనే కర్ణాటక సరిహద్దు ఉంటుంది. రామగిరి మండలంలో టవర్లు నిర్మిస్తున్న కంపెనీలే అక్కడా రైతుల భూముల్లో సోలార్ టవర్లు నిర్మిస్తున్నాయి. కర్ణాటక రైతులకు ఒక్కో టవర్ నిర్మాణానికి భూమి తీసుకున్నందుకు రూ.40 లక్షలు ఇస్తున్నాయి. అలాగే విద్యుత్ తీగలు పొలంలో ఎంత మేర వెళ్తే అంత మేర మీటర్‌కు రూ.30 వేల చొప్పున సపరేట్‌గా డబ్బులు ఇస్తున్నారు. కానీ రామగిరి మండలంలో ఇలాంటి ఒప్పందాలేమీలేవు. తమకు జరుగుతున్న అన్యాయంపై ఎవరిని కలవాలో, ఎవరికి తెలపాలో కూడా తెలియడం లేదని బాధిత రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం రామగిరి మండలంలోని రైతుకు సమాచారం ఇవ్వకుండానే వారి భూముల్లో యంత్రాల సాయంతో పెద్దపెద్ద గుంతలు తవ్వి కరెంట్ స్తంభాలు వేసేందుకు సిద్ధపడుతున్నారు. తమకు న్యాయం జరగకపోతే అందరం కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగుతామని ఆయా గ్రామాల రైతులు చెబుతున్నారు.
అరకొర ఇచ్చేందుకు ప్లాన్..
ఇప్పటికే సోలార్ టవర్ల నిర్మాణాలు చేపట్టిన పరిటాల కుటుంబం... విషయం పెద్దదైతే రైతులకు అరకొర ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ‘‘ఇక్కడేం పండుతుంది.. ఎకరం రూ.3 లక్షలు కూడా పలకదు.. టవర్ కోసం మహా అయితే 20 సెంట్లు తీసుకుంటారు. మీరడిగితే రూ.2 లక్షలకు మించి ఇవ్వరు. మా ద్వారా వెళితే..రూ.5 లక్షల వరకూ ఇప్పిస్తాం..అందరినీ తీసుకురా’’ అంటూ ఆయా గ్రామాల్లోని బాధిత రైతులకు తమ అనుచరుల ద్వారా చెప్పిస్తున్నారు.
రామగిరి మండలంలో
సోలార్ విద్యుత్ టవర్ల నిర్మాణం
రైతులకు తెలియకుండానే
భూముల్లో నిర్మాణ పనులు
ప్రశ్నించిన రైతులపై
పరిటాల బంధువుల దౌర్జన్యం
ఎవరికి చెప్పుకోవాలో
దిక్కుతోచని స్థితిలో రైతులు
రూ.వందలకోట్ల ప్రాజెక్ట్‌కు
అన్నీ తామై వ్యవహరిస్తున్న ‘పరిటాల’
నోరెత్తితే తంతారయ్యా
కర్ణాటకలో ఒక్కో టవర్ నిర్మాణానికి రూ.40 లక్షలు ఇస్తున్నారు. ఇక్కడేమో మాకు కనీసం సమాచారం ఇవ్వలేదు. మా పొలంలో టవర్ నిర్మించడంతో పాటు లైను లాగుతున్నారు. దీంతో పంటలు పెట్టుకోలేం. ఆ భూములను ఎవరూ కొనరు. ఏం చేయాలయ్యా. మేమూ టీడీపీ వాళ్లమే. మా ప్రభుత్వంలోనే మాకు ఇంత అన్యాయం జరుగుతోంది. ఏమైనా అడిగితే పరిటాల బంధువులు తంతారయ్యా. ఏం చేస్తాం..మా ఖర్మ ఇలా ఉంది.
– పేరు చెప్పేందుకు భయపడుతున్న
దుబ్బార్లపల్లికి చెందిన రైతు ఆవేదన ఇది
గ్రామసభల ఊసేలేదు..
కంపెనీల ఏర్పాటు, అభివృద్ధి పనులు, ఇతరత్రా పనులకైనా రైతుల భూములు సేకరించాలంటే ముందుగా గ్రామ సభ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎలాంటి పనులు చేపడతున్నారో రైతులకు వివరించాల్సి ఉంటుంది. అనంతరం రైతులు, అధికారుల సమక్షంలోనే పరిహారం గురించి చర్చించాల్సి ఉంటుంది. రైతులంతా ఒప్పుకుంటేనే అగ్రిమెంట్ చేసుకుని వారి పొలాల్లో పనులు చేపట్టాలి. కానీ రామగిరి మండలంలోని రైతులకు అలాంటి అవకాశమే లేకుండా పోయింది. సోలార్ విద్యుత్ టవర్ల నిర్మాణం చేపట్టిన కంపెనీలతో ‘పరిటాల’ కుటుంబమే పెద్దమొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు విమర్శలున్నాయి. దీంతో వారు గ్రామసభల ఏర్పాటు ఇతరత్రా వ్యవహారాల జోలికి వెళ్లలేదు. అటు కంపెనీ నుంచి భారీగా డిమాండ్ చేస్తున్న పరిటాల కుటుంబీకులు రైతులకు మాత్రం సమాచారం లేకుండానే పనులు ప్రారంభించడం గమనార్హం. దుబ్బార్లపల్లిలో నాలుగు టవర్లు ఏర్పాటవుతుండగా..భూనిర్వాసితులంతా టీడీపీ నాయకులే. కానీ మట్టినమూనాల కోసం గుంతలు తీస్తున్నామని చెప్పి...ఇప్పుడు ఏకంగా టవర్ల ఏర్పాటు కోసం గుంతలు తవ్వుకున్నారు. చిన్నకొండాపురం, పెద్ద కొండాపురం, రెడ్డివారిపల్లిలో తమకు ఇష్టంలేదని రైతులు అభ్యంతరం తెలుపుతున్నా పట్టించుకునే వారే లేరు.
రామగిరి మండలం దుబ్బార్లపల్లిలోని ఓ రైతు పొలంలో సోలార్ విద్యుత్ టవర్ నిర్మాణం కోసం జరుగుతున్న పనులివి. రైతుకు తెలియకుండానే పొలంలో భారీగా గుంతలు తవ్వుతున్నారు. గ్రామ సభ నిర్వహించకుండా...పరిహారం తేల్చకుండానే పనులు ప్రారంభించడంతో రైతులు లబోదిబోమంటున్నారు. రామగిరి మండలంలోని దుబ్బార్లపల్లి, ముత్యాలంపల్లి, మక్కినవారిపల్లి, చిన్నకొండాపురం, పెద్ద కొండాపురం, రెడ్డివారిపల్లి గ్రామాల్లోని రైతుల పొలాల్లో దాదాపు వంద సోలార్ విద్యుత్ టవర్ల నిర్మాణానికి ఆయా కంపెనీలు సిద్ధం కాగా, వ్యవహారమంతా పరిటాల కుటుంబీకుల కనుసన్నల్లో సాగుతోంది. దీంతో నోరు మెదపలేని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.


