నాణ్యత.. నగుబాటు | - | Sakshi
Sakshi News home page

నాణ్యత.. నగుబాటు

Sep 12 2026 12:24 AM | Updated on Sep 12 2026 12:24 AM

అనంతపురం సిటీ: మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే చర్యలకు చంద్రబాబు సర్కార్‌ తెరలేపింది. యూనిఫాం పేరుతో అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇటీవల సమకూర్చిన చీరలే ఇందుకు నిదర్శనం. నాణ్యత లేని చీరలు తమకొద్దని పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు ఐసీడీఎస్‌ అధికారులకు వెనక్కు ఇచ్చేస్తుండడం ప్రస్తుతం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

గత ప్రభుత్వంలో భేష్‌!

తాము నిర్వర్తిస్తున్న విధుల్లో క్రమశిక్షణ, వృత్తిపరమైన గుర్తింపు, సమానత్వాన్ని ప్రతిబింబించేలా చిరుద్యోగులకు ఏకరూప దుస్తుల (యూనిఫాం) విధానాన్ని గత ప్రభుత్వాలు అమలులోకి తీసుకువచ్చాయి. ఈ క్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నాణ్యమైన చీరలను సమకూర్చింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంగన్‌వాడీల చీరల రంగు మార్చి సరఫరా చేసింది. జిల్లాలోని కొన్ని ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇటీవల అధికారులు అందజేసిన ఈ చీరలు పూర్తి నాసిరకంగా ఉండడంతో వాటిని ధరించేందుకు చాలామంది వెనుకంజ వేశారు. ఒక్కో చీరకు రూ.250కు పైగా వెచ్చించినట్లు సమాచారం. అయితే ఈ చీరలు అంత ఖరీదు చేయవని, రూ.100 లోపే వీటి ధర ఉంటుందని పలువురు పేర్కొంటున్నారు. నాసిరకంగా ఉన్న ఈ చీరలు ధరిస్తే పిగిలి (చిరిగి) పోవడం ఖాయమనే భావన అంగన్‌వాడీ కార్యకర్తల్లోనూ వ్యక్తమవుతోంది. దీంతో చీరలు అందుకున్న అంగన్‌వాడీ కార్యకర్తలు వాటిని అధికారులకు తిరిగి ఇచ్చేయడం మొదలు పెట్టారు.

16 నుంచి ఆర్డీటీ బాలుర క్రికెట్‌ టాలెంట్‌ హంట్‌

అనంతపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన క్రికెట్‌ క్రీడాకారులను గుర్తించి, వారికి మెరుగైన శిక్షణ అందించే క్రమంలో ఆర్డీటీ చేపట్టిన క్రికెట్‌ టాలెంట్‌ హంట్‌ బాలుర విభాగం ఎంపికలు ఈ నెల 16 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు ఆర్డీటీ క్రీడా విభాగం డైరెక్టర్‌ సాయికృష్ణ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 5కు బాలికల విభాగంలో ఎంపికలు పూర్తి కాగా, 16వ తేదీ నుంచి అక్టోబర్‌ 7 వరకు బాలుర విభాగంలో ఉమ్మడి జిల్లాలోని 14 మండల కేంద్రాల్లో ఎంపికలు చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు నిర్ణీత తేదీల్లో ఉదయం 9 గంటలకు ఎంపిక చేసే ప్రాంతాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి.

బాలుర ఎంపిక షెడ్యూల్‌ ఇలా..

ఈ నెల 16న మడకశిర, 17న పెనుకొండ, 18న హిందూపురం, 22న రాయదుర్గం, 23న కళ్యాణదుర్గం, 24న ఆత్మకూరు, 25న పుట్టపర్తి, 28న గుత్తి, 29న తాడిపత్రి, 30న గుంతకల్లు, అక్టోబర్‌ 1న ఉరవకొండ, 5న కదిరి, 6న ధర్మవరం, 7న అనంతపురంలో బాలుర ఎంపికలు జరగనున్నాయి.

స్టేషన్‌ నుంచి దొంగ పరారీ?

గుత్తి: పట్టణ పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఓ దొంగ శుక్రవారం పరారైనట్లు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. గుత్తి, గుంతకల్లు, పామిడితో పాటు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన దొంగను నాలుగు రోజుల క్రితం గుత్తి పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌లో ఉంచి విచారణ చేస్తున్నారు. అయితే పోలీసుల కన్ను గప్పి సదరు దొంగ పరారైనట్లు తెలిసింది. అయితే పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement