ఉమ్మడి ‘స్థానిక’ ఓటర్లు 25.18 లక్షలు | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి ‘స్థానిక’ ఓటర్లు 25.18 లక్షలు

Sep 12 2026 12:24 AM | Updated on Sep 12 2026 12:24 AM

ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లే కీలకం

అనంతపురం న్యూ టౌన్‌: ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 25.18 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు జిల్లా పరిషత్‌ ముఖ్య కార్య నిర్వహణ అధికారి పి.విజయలక్ష్మి వెల్లడించారు. నగరంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం జెడ్పీటీసీ స్థానాల వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ల ఫొటోలతో కూడిన జాబితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో మొత్తం 847 మండల ప్రాదేశిక (ఎంపీటీసీ) స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గతంలో కంటే ఆరు ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో 841 స్థానాలకు ఎంపీటీసీ సభ్యులను ఎన్నుకున్నారు. అప్పట్లో జిల్లాలోని పామిడి మండలాన్ని నగర పంచాయతీగా గుర్తించడంతో కొన్ని ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. ప్రస్తుతం ఈ మండలం నుంచి ఆరు స్థానాలతో కలిపి అనంతపురం జిల్లాలో 450 ఎంపీటీసీ స్థానాలకు పెరిగాయి. ఇదే సమయంలో శ్రీసత్యసాయి జిల్లాలో ఎంపీటీసీ స్థానాల్లో ఎలాంటి మార్పూ లేదు. ప్రస్తుతం అక్కడ 397 మండల ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

మహిళా ఓటర్లే ‘కీలకం’

ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 25,18,110 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 12,40,009 పురుషులు కాగా 12,77,947 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా మొత్తంగా 154 మంది ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారు. అనంతపురం జిల్లాలో 6,73,335 మంది పురుష ఓటర్లు కాగా 6,78,835 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అనంతపురం జిల్లాలో 5,602 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. కాగా శ్రీ సత్య సాయి జిల్లాలో మొత్తం 12,77,976 మంది కాగా.. వీరిలో 5,66,776 మంది పురుషులు కాగా 5,99,112 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే శ్రీ సత్యసాయి జిల్లాలో 32,336 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. వీరు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా శ్రీ సత్యసాయి జిల్లాలో కీలకంగా మారనున్నారు. ఇక జిల్లా ప్రాదేశిక స్థానాల విషయంలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 63 ఉండగా అనంతపురం జిల్లాలో 31 స్థానాలు, శ్రీసత్యసాయి జిల్లాలో 32 జిల్లా ప్రాదేశికస్థానాలు ఉన్నట్లు సీఈఓ విజయలక్ష్మి వివరించారు.

అందుబాటులో ఓటరు జాబితాలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలో పల్లె ఓటరు తుదిలెక్క తేలింది. అన్ని గ్రామ పంచాయతీల తుది ఓటర్ల జాబితాలను అధికారులు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర కేటగిరీల వారీగా ఓటర్ల వివరాలతో తుది జాబితాలను సిద్ధం చేసి సంబంధిత గ్రామ పంచాయతీల్లో ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచినట్లు జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజ నాయుడు తెలిపారు.

బీసీలే అత్యధికం

అనంతపురం జిల్లాలో మొత్తం ‘స్థానిక’ ఓటర్లలో బీసీలు కీలకంగా మారనున్నారు. 8,02,409 మంది బీసీ ఓటర్లు ఉన్నారు. వీరిలో 3,97,406 మంది పురుషులు, 4,04,927 మంది మహిళలు, 76 మంది ఇతరులు ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 2,22,628 మంది కాగా.. వీరిలో 1,09,281 మంది పురుషులు, 1,13,313 మంది మహిళలు, 34 మంది ఇతరులు ఉన్నారు. ఎస్టీ ఓటర్లు జిల్లాలో 46,648 మంది ఉన్నారు. వీరిలో 23,334 మంది పురుషులు, 23,313 మంది మహిళలు, ఇతరులు ఒకరు ఉన్నారు. ఇతర కేటగిరీలకు చెందిన ఓటర్లు 2,62,230 మంది ఉన్నారు. వీరిలో 1,32,430 మంది పురుషులు, 1,29,789 మంది మహిళలు, 11 మంది ఇతరులు ఉన్నారు. పంచాయతీల వారీగా తుది జాబితాలను ప్రజలు పరిశీలించుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement