గుత్తి: పట్టణ పోలీసులు శుక్రవారం నలుగురితో కూడిన గంజాయి ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1,200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ కారును సీజ్ చేశారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో వివరాలను సీఐ రామారావు విలేకరులకు తెలిపారు. రాయదుర్గం, గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం ప్రాంతాలకు చెందిన ఎరుకల శ్రీనివాసులు, ఎరుకల సురేష్, ఎరుకల మంజునాథ్, వంశీలు ముఠాగా ఏర్పడి కర్ణాటక రాష్ట్రంలో గంజాయిని కొనుగోలు చేసేవారు. అనంతపురం, గుత్తి, గుంతకల్లు ప్రాంతాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకునే వారు. పక్కా సమాచారం రావడంతో సీఐ నేతృత్వంలో పోలీసులు కొత్తపేట సమీపంలోని బ్రిడ్జి వద్ద హైవేపై కారులో వెళుతున్న వీరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1,200 గ్రాముల గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమో దు చేసి నిందితులను కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ చెప్పారు.
కేజీబీవీ బోధన సిబ్బంది తుది మెరిట్ జాబితా విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది పోస్టుల భర్తీకి సంబంధించి తుది మెరిట్ జాబితాను శుక్రవారం విడుదల చేశారు. సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు చేపట్టిన నియామక ప్రక్రియలో భాగంగా ప్రొవిజనల్ మెరిట్ జాబితా నుంచి రోస్టర్ ప్రకారం 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపిక చేశారు. ఆగస్టు 18, 19 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన అభ్యర్థుల తుది మెరిట్ జాబితాను జిల్లా సమగ్ర శిక్ష వెబ్‌సైట్ http://samagrashi kshaatp.blogspotలో అందుబాటులో ఉంచి నట్లు ఏపీసీ శైలజ తెలిపారు. అభ్యర్థులు తమ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే తగిన ఆధారాలతో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో నేరుగా సమర్పించాలని తెలిపారు. గడువు అనంతరం అందే అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోబోమని ఏపీసీ శైలజ స్పష్టం చేశారు.
న్యాయం చేయాలంటూ రాస్తారోకో
ఉరవకొండ: పట్టణ శివారులోని టీవీ టవర్ సమీపంలో ఈ నెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమకు న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు శుక్రవారం ఉరవకొండ ఆసుపత్రి ఎదుట ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కూలీనాలీ చేసుకుని జీవించే తమ కుటుంబాలకు పోషించే దిక్కు లేకుండా పోయిందన్నారు. ఐచర్ వాహనాన్ని అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో సంబంధిత యజమాని నుంచి తమకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో ఉరవకొండ సీఐ మహనంది, ఎస్‌ఐ జనార్థన్‌నాయుడు అక్కడికి చేరుకున్నారు. కచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కుటుంబ సభ్యులు శాంతించి మృతదేహాలను స్వగ్రామం వజ్రకరూరుకు తరలించారు.
చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి
గుత్తి రూరల్: మండలంలోని బేతాపల్లి గ్రామంలో శుక్రవారం టెంకాయ చెట్టుపై నుంచి పడి పృథ్విరాజు (35) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పృథ్విరాజు వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అమావాస్య కావడంతో గ్రామ శివారులోని తన తోట వద్ద ఉన్న చెట్టుపై టెంకాయలు తెచ్చేందుకు వెళ్లాడు. చెట్టు ఎక్కి టెంకాయలు, పట్టలు కోస్తుండగా ప్రమాదవశాత్తూ అదుపు తప్పి చెట్టుపై నుంచి కిందకు పడ్డాడు. ఎంతసేపయినా ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు తోట వద్దకు వెళ్లారు. తీవ్ర గాయాలతో చెట్టు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్న పృథ్విరాజును గమనించిన కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే గ్రామంలోని పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన చికిత్సలకు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పృథ్విరాజు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఇంటి పెద్ద దిక్కు మృతితో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య మౌనిక, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


