● యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు
అనంతపురం ఎడ్యుకేషన్: పోరాటాలు, ఉద్యమాల ద్వారానే ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎన్ ప్రసాద్ అన్నారు. శనివారం అనంతపురంలోని నేతాజీ నగరపాలక ఉన్నత పాఠశాలలో ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప, ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో వారు మాట్లాడారు. అంతర్ జిల్లా పునర్విభజన, వేతన సవరణ సంఘం సాధన, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, పెండింగ్ డీఏలు, ఆర్థిక బకాయిల సాధన కోసం ఉపాధ్యాయులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సిన వేతన సవరణ, డీఏలు, ఆర్థిక బకాయిలపై యూటీఎఫ్ రాష్ట్రవ్యాప్తంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించిందన్నారు. రణభేరి కార్యక్రమాలతో పాటు ఏపీ జేఏసీ ఏర్పాటు వరకు, జేఏసీతో కలిసి 12వ వేతన సవరణ సంఘం కోసం ముఖ్యమంత్రితో చర్చల వరకు జరిగిన పరిణామాలను ఉపాధ్యాయులకు వివరించామని తెలిపారు. టెట్ విషయంలోనూ యూటీఎఫ్ అనేక పోరాటాలు చేసిందన్నారు. సమగ్ర శిక్షలో ఒప్పంద ఉద్యోగులుగా పనిచేస్తున్న శారీరక విద్యా ఉపాధ్యాయులకు కనీస వేతన శ్రేణి వర్తింపజేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ, ఆడిట్ కమిటీ సభ్యుడు రమణయ్య, నాయకులు శ్రీనివాసులు, రామకృష్ణనాయక్, అర్జున్‌శేఖర్, రవికుమార్, చంద్రమోహన్, రామాంజనేయులు పాల్గొన్నారు.


