గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Sep 13 2026 7:52 AM | Updated on Sep 13 2026 7:52 AM

రాప్తాడు రూరల్‌: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని అయ్యవారిపల్లి క్రాస్‌ సమీపంలో జాతీయ రహదారి–44పై శనివారం చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. పెద్దవడుగూరు మండలం చింతలచెరువు గ్రామానికి చెందిన కోనేపల్లి ఆదినారాయణరెడ్డి (61) బస్సులకు అవసరమైన విడిభాగాలు తీసుకురావడానికి ఉదయం బైకులో రాప్తాడు ఆటోనగర్‌కు వచ్చాడు. విడిభాగాలు తీసుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తూ అయ్యవారిపల్లి క్రాస్‌ వద్ద అనంతపురం వైపు వెళ్తుండగా బెంగళూరు వైపు నుంచి వచ్చిన గుర్తుతెలియని వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. వాహనం ఆపకుండా వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఆదినారాయణరెడ్డి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కథల పోటీలకు ఆహ్వానం

అనంతపురం కల్చరల్‌: రాయలసీమ సమకాలీన పరిస్థితుల నేపథ్యంలో సాగే కథా రచన పోటీలను నిర్వహిస్తున్నట్లు రాయలసీమ సాంస్కృతిక వేదిక సమన్వయకర్త డాక్టర్‌ అప్పిరెడ్డి హరినాథరెడ్డి తెలిపారు. రాయలసీమ ఉద్యమనేత డాక్టర్‌ ఎంవీ రమణారెడ్డి స్మారకార్థం నిర్వహిస్తున్న కథల పోటీలకు రచనలు నవంబర్‌ 10లోపు పంపాలని కోరారు. రూ.20 వేల వరకు నగదు బహుమతులందిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 9963917187 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

‘స్థానిక’ ఎన్నికల్లో

పోటీకి సమాయత్తం కండి

సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ

అనంతపురం అర్బన్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సమాయత్తం కావాలని సీపీఐ నాయకులు, శ్రేణులకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా కార్యదర్శులు పి.నారాయణ స్వామి, వేమయ్య యాదవ్‌ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశానికి రామకృష్ణతో పాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్‌, కార్యవర్గ సభ్యుడు సి.జాఫర్‌ హాజరయ్యారు. రామకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాక్షేత్రంలో విఫలమయ్యారన్నారు. తక్షణం రైతుల రుణాలను మాఫీ చేయాలన్నారు. పంట నష్ట పరిహారం, బీమా అందించాలన్నారు. మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే నినాదంతో డిసెంబరు 1,2,3 తేదీల్లో జైలు భరో తలపెట్టామని, కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. సమావేశంలో సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడి, సభ్యులు కాటమయ్య పాల్గొన్నారు.

కూలి పనులకు వెళ్లి కానరాని లోకాలకు

పామిడి: రోడ్డు ప్రమాదంలో మహిళా కూలీ మృతి చెందిన ఘటన మండలంలోని పాళ్యం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఏకుల నారాయణస్వామి, ఏకుల సువర్ణమ్మ (46) దంపతులు. వారికి ఇద్దరు కుమారులు సంతానం. దంపతులిరువురూ వ్యవసాయంతో పాటు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. సువర్ణమ్మ శనివారం శంకర్‌కు సంబంధించిన వరిమడిలో కలుపు మొక్కల తొలగింపునకు కూలీగా వెళ్లింది. సాయంత్రం పనులు ముగించుకుని ట్రాక్టర్‌ ఇంజిన్‌కు వెనుక ట్రాలీలా ఏర్పాటు చేసుకున్న టైరుబండిలో కూర్చుని ఇంటికి తిరుగు పయనమైంది. ఉన్నఫళంగా ట్రాక్టర్‌ ఇంజిన్‌ ఉక్కుకు ఉన్న పిన్‌ తెగిపోవడంతో టైరు బండి బోల్తా పడింది. ఈ క్రమంలోనే బండి చక్రం కిందపడిన సువర్ణమ్మ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతో ఉన్న మిగతా 8 మంది మహిళా కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. మృతురాలి భర్త ఏకుల నారాయణస్వామి ఫిర్యాదు మేరకు పామిడి పోలీసులు కేసు నమోదు చేశారు.

అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌

బొమ్మలసత్రం: రెండు తెలుగు రాష్ట్రాల్లో చోరీలకు పాల్పడుతూ 93 కేసుల్లో నిందితునిగా ఉన్న అంతర్రాష్ట్ర దొంగను నంద్యాల పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎస్పీ సుస్మిత నిందితుడి వివరాలను మీడియాకు వివరించారు. గత నెల 20వ తేదీన స్థానిక రైల్వే స్టేషన్‌ సమీపంలోని మహానంది కాలనీలో చోరీ జరిగింది. ఒక ఐఫోన్‌, వాచ్‌, స్కూటీ అపహరించినట్లు బాధితులు త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అధునాతన సాంకేతికత ద్వారా దర్యాప్తు చేపట్టి ఆచూకీ గుర్తించారు. జిల్లాలోని వెస్ట్‌ కోడిపల్లెకు చెందిన శివగా గుర్తించి శనివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో 93 దొంగతనాల కేసుల్లో ఉన్నట్లు అంగీకరించాడు. చోరీ చేసిన సెల్‌ ఫోన్‌, వాచ్‌, స్కూటీలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement