అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ) ప్రొఫెసర్ డాక్టర్ వైశాలి జి. ఘోర్పడేను విశిష్ట మహిళా ఇంజినీర్ అవార్డు– 2026కు ఎంపిక చేశారు. మంగళవారం 56వ ఇంజినీర్స్ డే అవార్డులను ది ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ (ఇండియా), ఏపీఎస్‌సీ ప్రకటించాయి. ప్రస్తుతం వైశాలి జి. ఘోర్పడే జేఎన్‌టీయూలో రీసెర్చ్ – డెవలప్‌మెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పరిశోధన, ఆవిష్కరణలు, మేధో సంపత్తి హక్కులు, సాంకేతికత ఆధారిత పరిశోధనలను బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. డాక్టర్ వైశాలి ఎంపికపై వర్సిటీ వీసీ డా.హెచ్ సుదర్శనరావు, రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఆమెలోని విద్యా నైపుణ్యం, పరిశోధన ప్రతిభ, ఇంజినీరింగ్ రంగానికి అందిస్తున్న విశిష్ట సేవలు, పరిపాలన నాయకత్వం, సంస్థాగత అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమంపై నిబద్ధతతకు ఈ గౌరవం ప్రతీకగా నిలుస్తుందని కొనియాడారు. ఆమె అకడమిక్ ప్రొఫైల్‌లో 70కి పైగా పరిశోధనా ప్రచురణలు, పుస్తక అధ్యాయాలు, బాహ్య నిధులతో కూడిన పరిశోధనా కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేసిన కృషి ఉన్నాయన్నారు.


