నార్పల: శింగనమల, నార్పల, గార్లదిన్నె మండలాల్లో కేబుల్, బొందలవాడలో ఇంట్లో దొంగతనం, బైక్‌లు చోరీ చేసిన ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ సాగర్ తెలిపారు. బుధవారం నార్పలలోని పోలీస్‌స్టేషన్‌లో ఆయన విలేకరులతో వివరాలు వెల్లడించారు. నార్పల సీపీఎం కొట్టాలకు చెందిన మురళి, బుక్కరాయసముద్రం ఎన్‌టీఆర్ మార్గ్‌కు చెందిన ఆంజనేయప్రసాద్, జనచైతన్య కాలనీకి చెందిన అమీన్ బాబా, అనంతపురం పాతూరుకు చెందిన సాయినాథ్, ధర్మవరానికి చెందిన గంగాధర, తాడిపత్రికి చెందిన హరీష్‌లను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి బొందలవాడ గ్రామంలో దొంగతనం చేసిన నాలుగు బంగారు చిన్న ఉంగరాలు, జత కమ్మలు, వెండి గొలుసులు రెండు కుంకమ గిన్నెలు, 1000 మీటర్ల కాపరు వైరు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిని కోర్టులో హాజరుపర్చామన్నారు.
పాము కాటుకు బలైన రైతు
బెళుగుప్ప: పాముకాటుకు ఓ రైతు బలైన సంఘటన మండల పరిధిలోని దుద్దేకుంటలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. దుద్దేకుంటలో రైతు పుల్లయ్య (69) బుధవారం తనకున్న మూడు ఎకరాల్లో సాగు చేసిన వేరుశనగ పంట నూర్పిడికి కుమారుడు లక్ష్మినారాయణతో పాటు మరో పది మంది కూలీలతో కలసి పొలంలో పనులు చేస్తున్నాడు. ఈ సమయంలో విష సర్పం పుల్లయ్య ఎడమచేతిపై కాటు వేయడంతో గట్టిగా అరిచాడు. పాము కాట్లు ఉండటంతో హుటాహుటిన రైతు కుమారుడు లక్ష్మినారాయణ, అన్న కుమారుడు రఘు ఆయన్ను ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన 108 వాహనంలో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రైతు పుల్లయ్య మృతి చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య రామాంజినమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ప్రభుత్వమే తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు మొర పెట్టుకుంటున్నారు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ శివశంకర్‌నాయక్ తెలిపారు.


