హెచ్చెల్సీ ఎస్‌ఈగా విఠల్‌ ప్రసాద్‌ | - | Sakshi
Sakshi News home page

హెచ్చెల్సీ ఎస్‌ఈగా విఠల్‌ ప్రసాద్‌

Sep 10 2026 1:03 AM | Updated on Sep 10 2026 1:03 AM

అనంతపురం సెంట్రల్‌: హెచ్చెల్సీ ఎస్‌ఈగా విఠల్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. ప్రస్తుత ఇన్‌చార్జ్‌ ఎస్‌ఈ సుధాకర్‌రావు వ్యక్తిగత కారణాలతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. దీంతో మదనపల్లిలో హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ సర్కిల్‌ –3 ఎస్‌ఈగా పనిచేస్తున్న విఠల్‌ప్రసాద్‌కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గురు, శుక్రవారాల్లో ఆయన బాధ్యతలు తీసుకోనున్నట్లు హెచ్చెల్సీ అధికార వర్గాలు వెల్లడించాయి.

చిన్న నీటి పారుదలశాఖకు

నూతన అధికారులు

చిన్న నీటి పారుదలశాఖ ఎస్‌ఈగా తిరుపతి తెలుగు గంగా ప్రాజెక్టు ఎస్‌ఈగా పనిచేస్తున్న శారదను నియమించారు. ఈమె బుధవారం బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ ఎస్‌ఈగా ఇరిగేషన్‌ సర్కిల్‌లో ఐబీ డివిజన్‌ ఈఈ ఏ. రాముకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జలవనరులశాఖ ఈఎన్‌సీ వరప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

‘కుష్టు’ నివారణే లక్ష్యం

అనంతపురం సిటీ: జిల్లాలో కుష్టు వ్యాధిని సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా పనిచేయాలని సంబంధిత అధికారులకు డీఎంహెచ్‌ఓ కట్టా వెంకటేశ్వర్లు సూచించారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 11 నుంచి 24వ తేదీ వరకూ జిల్లాలోని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో లెప్రసీ కేస్‌ డిటెక్షన్‌ క్యాంపెనింగ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే ఆ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను బుధవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఆయన ఆవిష్కరించారు. ఇంటింటి సర్వే చేపట్టి కుష్టు వ్యాధి అనుమానిత కేసులను గుర్తించనున్నట్లు డీఎంహెచ్‌ఓ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కుష్టు నివారణ అధికారి బి.జయలక్ష్మి, డాక్టర్‌ శివారెడ్డి, పారా మెడికల్‌ అధికారి నాగన్న, డీపీఎంఓలు రామదాస్‌, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.

సమ్మె విరమించిన కార్మికులు

కూడేరు: మండల పరిధిలోని పీఏబీఆర్‌ డ్యాం వద్ద ఏర్పాటైన సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న కార్మికులు బుధవారం సమ్మె విరమించారు. పెండింగ్‌లో ఉన్న 5 నెలల వేతనాలు ఇవ్వాలని , ఇతర డిమాండ్ల సాధన కోసం కార్మికులు ఈ నెల 1 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రాజెక్ట డీఈ రామారావు, జేఈ భార్గవ్‌లు చర్చలు జరిపి ఒక నెల వేతనం డబ్బులు బుధవారం కార్మికుల ఖాతాల్లోకి జమ చేశారు. గురువారం మరో నెల వేతనం జమ చేస్తామని , మరో 10 రోజుల్లో మిగిలిన వేతనాన్ని జమ చేస్తామని హామీ ఇచ్చినట్లు ఆ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌ తెలిపారు. సమ్మె విరమించి విధుల్లోకి చేరుతున్నామని పేర్కొన్నారు. 10 రోజుల తర్వాత మిగిలిన వేతనాలు ఇవ్వకపోతే మళ్లీ సమ్మెబాట పడుతామని ఆయన హెచ్చరించారు.

విద్యుదాఘాతంతో రైతు మృతి

పెద్దపప్పూరు: పందుల బెడద నుంచి పంటను కాపాడుకోవాలని కాపలాగా వెళ్లిన ఓ రైతు ప్రమాదవశాత్తూ విద్యుదాఘానికి గురై మృతి చెందిన సంఘటన బుధవారం పెద్దపప్పూరు మండలంలో చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని తురకపల్లికి చెందిన ఆదినారాయణరెడ్డి (61) తనకున్న పొలంలో మొక్కజొన్న పంటను సాగుచేశాడు. పందుల బెడద నుంచి పంటను కాపాడుకునేందుకు తరచూ రాత్రిళ్లు, తెల్లవారుజామున పొలానికి వెళ్లేవాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున పొలానికి వెళ్లిన ఆదినారాయణరెడ్డి తెగిపడిన లెవెన్‌ కేవీ విద్యుత్‌ వైరును గుర్తించకపోవడంతో విద్యుదాఘానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి నలుగురు కుమార్తెలు సంతానం కాగా అందరికీ వివాహాలు అయ్యాయి. ఒకరు ఎస్‌ఐ, మరొకరు బ్యాంకు మేనేజర్‌, ఇంకొకరు సాఫ్ట్‌వేర్‌, ఒకరు వ్యవసాయ కుటుంబలో స్థిరపడ్డారు. గత కొన్నేళ్లుగా మృతుడి పెద్దయక్కలూరులో నివాసముంటున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement