ఉరవకొండ: నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలపై ఆర్థిక భారం పడుతోందని, వెంటనే అధికారులు స్పందించిన ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన అనంతపురంలో జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గత ఏడాదితో పొలిస్తే నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. ముఖ్యంగా కొందరు దళారీలు, వ్యాపారులు బ్లాక్ మార్కెట్‌కు సరుకులు తరలిస్తుండటంతో ధరలు అందనంతస్థాయికి పెరిగిగాయన్నారు. చౌకదుకాణాల ద్వారా పేదలకు నిత్యావసరాలు అందించాలన్నారు. జిల్లాలో తీవ్ర కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకొని కరువు సహాయక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, పశుగ్రాసం కొరత తీర్చడానికి దానా కేంద్రాలు వెంటనే ప్రారంభించాలన్నారు. హంద్రీనీవా ద్వారా ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల్లోని చెరువులకు నీరు అందించాలన్నారు. చెరువులు, కుంటలు నిండితే కనీసం పశువుల దాహర్తి అయినా తీరుతుందన్నారు. కరువుతో దెబ్బతిన్న పంటలకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని కోరారు.


