అనంతపురం న్యూటౌన్: స్థానిక సంస్థల సమరానికి వైఎస్సార్‌సీపీ సన్నద్ధమవుతోంది. అందులో భాగంగా బుధవారం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని నగరంలోని జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసింది. మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాట్లను పర్యవేక్షించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అనంతరం విలేకరులతో మాట్లాడారు. పార్టీ బలోపేతానికి, రాబోయే ‘స్థానిక’ పోరులో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్లమెంట్ పరిశీలకుడు బోరెడ్డి నరేష్ కుమార్‌రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మధ్యా హ్నం 3 గంటలకు విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమవుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పరిశీలకులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ విభాగాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
తాగునీటి సరఫరాలో
నిర్లక్ష్యం.. ఇద్దరికి షోకాజ్
అనంతపురం ఎడ్యుకేషన్: కుందుర్పి మండలం అప్పిలేపల్లిలో తాగునీటి సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి, డిప్యూటీ ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజ నాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామ ప్రజలకు తాగునీటి సరఫరా ఎందుకు నిలిచిపోయింది? అంతరాయానికి కారణాలేమిటి? సమస్య పరిష్కారానికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే అంశాలపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని డీపీఓ సూచించారు. నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిన వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
చుక్కలు చూపుతున్న ‘సర్వర్’
బొమ్మనహాళ్: సామాజిక భద్రత పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారికి సర్వర్ పనిచేయకపోవడంతో చుక్కలు కనిపించాయి. రెండేళ్ల తర్వాత కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఆహ్వానించడం.. అదీ ఈ నెల 16వ తేదీలోపు వరకే గడువు ఉండడంతో అర్హులైన వారు సచివాలయాలకు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో రెండవరోజు మంగళవారం నేమకల్లు సచివాలయంలో సర్వర్ మొరాయించడంతో దరఖాస్తుదారులు గంటల తరబడి ఎదురుచూడాల్సి వచ్చింది. మరికొన్ని చోట్ల అయితే సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో దరఖాస్తుల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. మిగిలిన రోజుల్లో పరిస్ధితి ఎలా ఉంటుందోనని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్ ప్రక్రియపై అవగాహన లేని వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు కుటుంబ సభ్యులు లేదా ఇతరులతో కలిసి సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్ధితులు ఏర్పడ్డాయి.


