అనంతపురం అగ్రికల్చర్: కరువు మండలాలను ప్రకటించేందుకు చంద్రబాబు సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. ఎల్–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నడుమ ఇప్పటికే కరువు గుప్పిట్లోకి వెళ్లినా.. ముందస్తు ప్రకటన చేయకుండా వేచిచూసే ధోరణి అవలంబిస్తుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా జిల్లా వ్యాప్తంగా కరువు ఛాయలు కమ్మేశాయి. అయినా కరువు మండలాలను ప్రకటించకుండా ఆలస్యం చేస్తుండటం గమనార్హం. ఈ నెలాఖరులోపు వర్షం వస్తే... కొన్ని మండలాలను జాబితా నుంచి తప్పించే ఎత్తుగడే ఆలస్యానికి కారణంగా చెబుతున్నారు.
అన్నింటా లోటు వర్షపాతం
ఖరీఫ్ సీజన్‌లో లోటు వర్షపాతం నమోదైంది. జూన్‌లో 61.2 మి.మీకు గాను 11.8 శాతం అధికంగా 68.4 మి.మీ నమోదైంది. ఇక విత్తుకు కీలకమైన జూలైలో 64.3 మి.మీకు గాను ఏకంగా 70.8 శాతం తక్కువగా 18.8 మి.మీ నమోదైంది. పంటలు కీలకదశలో ఉండే ఆగస్టులో 84.4 మి.మీకు గాను 54 శాతం తక్కువగా 33.8 మి.మీ వర్షం కురిసింది. ఇక సెప్టెంబర్‌లో 111.6 మి.మీకు గాను కేవలం 1.8 మి.మీ నమోదు కావడం గమనార్హం. ఇలా నెలలు కరిగిపోతున్నా వర్షం జాడ కరువైంది. ఇప్పటి వరకు 230 మి.మీకు గాను 47 శాతం తక్కువగా 123 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇదే పరిస్థితి కొనసాగితే నాలుగైదు రోజుల్లో వర్షపాతం లోటు 50 శాతానికి చేరువకానుంది. 32 మండలాల్లోనూ సాధారణం కన్నా తక్కువగానే వర్షపాతం నమోదు కావడంతో కరువు జాబితాలోకి చేరాల్సిన పరిస్థితి నెలకొంది.
70 శాతానికి చేరిన ‘ఖరీఫ్’
ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం తాజా నివేదిక ప్రకారం 70 శాతానికి చేరింది. 3.43 లక్షల హెక్టార్లకు గానూ 2.38 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేశారు. అందులో కంది మాత్రమే అధికంగా సాగు చేశారు. 78,274 హెక్టార్లు అంచనా వేయగా ఏకంగా 1.18 లక్షల హెక్టార్లకు చేరింది. 1.47 లక్షలు హెక్టార్లు అంచనా వేసిన వేరుశనగ 51 వేల హెక్టార్లకు పరిమితమైంది. ఇక పత్తి 28 వేల హెక్టార్లు, మొక్కజొన్న 14,500 హెక్టార్లు, ఆముదం 11,500 హెక్టార్లు, సజ్జ 2,300 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 430 హెక్టార్లు, ఉలవ 220 హెక్టార్లు, అలసంద 150 హెక్టార్లు, జొన్న 430 హెక్టార్లు, సోయాబీన్ 160 హెక్టార్లలో సాగు చేశారు. ఇక నీటి వసతి కింద 23 వేల హెక్టార్లు అంచనా వేసిన వరి ప్రస్తుతం 10,700 హెక్టార్ల వద్ద ‘సాగు’తోంది. నెలల తరబడి వర్షం లేకపోవడంతో ఒక్క పంట నుంచి కూడా దిగుబడులు వచ్చే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
ఇప్పటికే పంటలన్నీ ఎండుముఖం
ముందస్తు ‘కరువు’ ప్రకటనపై సర్కారు మౌనముద్ర
నెలాఖరులోపు వర్షం వస్తే మండలాలను తగ్గించేందుకు ఎత్తుగడ!


