అనంతపురం: తీవ్ర వర్షాభావంతో ఎండిపోతున్న పండ్లతోటలను, పంటలను కాపాడుకోవడానికి తక్షణమే హంద్రీ–నీవా నీటితో చెరువులు నింపాలని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం కలెక్టర్ ఆనంద్‌ను కలిసి జిల్లాలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులను వివరించి, వినతిపత్రం అందజేశారు. అనంతరం విశ్వ మాట్లాడుతూ జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రైతులను, ప్రజానీకాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హంద్రీ–నీవా కింద 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హంద్రీ–నీవా అనంతపురం, కర్నూలు జిల్లాల రైతులకు జీవనాడి వంటిదన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చెరువులకు నీరు ఇచ్చిన తరువాతే.. ఇతర ప్రాంతాలకు నీరు తరలించాలని కోరారు. గుంతకల్లు బ్రాంచ్ కెనాల్‌కు 300 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజూ నీరు వృథాగా కిందకు వెళ్తోందన్నారు. టీబీ డ్యాంలో 96 టీఎంసీల నీరున్నందున సరైన ప్రణాళికతో అనంతపురం జిల్లాకు అదనంగా 5 టీఎంసీల నీటిని మళ్లించే అవకాశం ఉందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
కూడేరులో దారుణ పరిస్థితులు
జిల్లాలో సగటు వర్షపాతం 550 మి.మీ అయితే, కూడేరు ప్రాంతంలో 350 మి.మీ మాత్రమే కురుస్తుందని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. అయితే ఈ ఏడాది ఎల్–నినో ప్రభావంతో 150 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైందన్నారు. భూగర్భ జలాలు ఇంకిపోయి బోర్లు ఎండిపోవడంతో కన్నబిడ్డల్లా పెంచుకున్న పండ్ల తోటలను కాపాడుకోవడానికి రైతులు రోజుకు ట్యాంకర్‌కు రూ.600 చొప్పున వెచ్చించాల్సి వస్తోందన్నారు. ఈ భారం మోయలేక రైతులు విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలే కాకుండా మనుషులకు, పశువులకు కూడా తీవ్రమైన తాగునీటి సమస్య తలెత్తిందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాయలసీమ జోనల్ అధికార ప్రతినిధి కేవీ రమణ, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, కూడేరు మండల అధ్యక్షుడు బైరెడ్డి రామచంద్రారెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హంద్రీ–నీవా కింద 3.5 లక్షల ఆయకట్టుకు నీరివ్వాలి
ఉమ్మడి జిల్లాలో చెరువులు నిండిన తర్వాతే ఇతర ప్రాంతాలకునీరు తరలించాలి
వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్


